హైదరాబాద్ నడి బొడ్డున మరో ప్రేమ జంటపై కత్తితో దాడి!

Wednesday, September 19th, 2018, 05:47:37 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఇటీవల ప్రణయ్ హత్య ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికి తెలిసిందే. కులాంతర వివాహం చేసుకున్నందుకు కూతురి తండ్రి అల్లుడిని హత్య చేయించాడు. ఆ ఘటన మరవకముందే హైదరాబాద్ నడిబొడ్డున మరో ప్రేమ వివాదం కలకలం సృష్టించింది. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఇద్దరి దంపతులకు (నవీన్ – మాధవి) చావు భయాన్ని చూపించింది. నడి రోడ్డులో అందరూ చూస్తుండగానే నవ దంపతులపై అమ్మాయి తండ్రే పదునైన కత్తితో దాడి చేశాడు.

ఘటన సమీపంలోని సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎర్రగడ్డ ప్రాంతంలో ఈ హత్యాయత్నం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని దంపతులపై ఈ దాడి జరిపించినట్లు సమాచారం. స్థానికులు దాడి చేసే వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అతను బెదిరించాడు. ఇక గాయపడిన జంట పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.