నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు కోర్ట్ సంచలన తీర్పు!

Thursday, June 14th, 2018, 04:02:23 PM IST

కేవలం తృచ్ఛమైన డబ్బు, ఆస్తి కోసం తన, పర తేడాలేకుండా హత్యలు చేస్తున్న రోజులివి.
దాదాపు ఎనిమిదిన్నరేళ్ళ క్రితం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన అభం శుభం తెలియని చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఆమెను అత్యంత కర్కశంగా హతమార్చిన ముగ్గురు నిందితులు శ్రీనివాసరావు, జగదీశ్, వెంకటరావు గౌడ్ లకు జీవిత ఖైదు విధిస్తూ నేడు విజయవాడ మహిళా సెషన్సు కోర్ట్ తీర్పు వెలువరించింది. అయితే నిందితులు తదుపరి అప్పీల్ కు పై కోర్టులకు వెళ్లేలా అవకాశం కల్పించారు. కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న వైష్ణవి బంధువులు, తీర్పు ఇంత ఆలస్యంగా రావడంతో అసంతృప్తి చెందుతున్నారు. తీర్పు మరికొద్దిరోజుల ముందు వస్తే బాగుండేదని, వైష్ణవి తల్లి ఆమెపై దిగులుతో గత ఏడాది మరణించారని కన్నీరు మున్నీరయ్యారు. 2010లో గుంటూరులో స్కూలుకు వెళుతున్న వైష్ణవిని, అతని సోదరుణ్ణి దారి మధ్యలో అటకాయించి బలవంతంగా అపహరించుకుపోయారు నిందితులు. ఆ సమయంలో వారి కార్ డ్రైవర్ అడ్డగించడంతో అతన్ని పొడిచి చంపి పిల్లలిద్దరినీ ఎత్తుకుపోయారు.

విజయవాడ వైపుగా వెళ్లదలిచిన నిందితులు మార్గ మధ్యలోనే వైష్ణవి గొంతు నులిమి చంపేశారు. అయితే ఆ సమయంలో వైష్ణవి సోదరుడు మాత్రం చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆమెను చంపేసాక గుంటూరు శివారులోని ఆటో నగర్ ప్రాంతంలో కారును ఆపి అక్కడ వినియోగించే ఐరన్ ఫైర్ బాయిలర్ లో వేసి కనీసం ఆమె ఎముకలు కూడా మిగలకుండా దారుణంగా బూడిద చేశారు. కాగా ఆ సమయంలో వైష్ణవి చెవికి పోగులు ఉండడం, వాటికి వజ్రం పొదిగి ఉండడంతో అదే ఆమె కేసులో కీలకంగా మారింది. దానితో కేసును మెల్లగా ఛేదించిన పోలీస్ లు చివరకు నేరస్థులను పట్టుకున్నారు. కాగా వైష్ణవిని దారుణంగా చంపి బూడిద చేసారు అన్న వార్త వినగానే ఆమె తండ్రి ప్రభాకర్ రావు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆ పై కొన్నేళ్ల తర్వాత ఇటీవల ఆమె తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ హత్య కేసు నిందులకు జీవిత ఖైదు విధించడంపై పలువురు ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments