కూట‌మి సిగ‌ప‌ట్లు .. సీపీఐ లొల్లి..

Tuesday, November 6th, 2018, 12:00:28 PM IST

తెలంగాణ‌లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా ఏక‌మైన కాంగ్రెస్‌, టీడీపీ, తెజ‌స‌, సీపీఐ మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. దీనిపై విప‌క్షాలు అనైతిక పొత్తంటూ విరుచుకుప‌డుతుంటే కూట‌మిలో జ‌ట్టుక‌ట్టిన పార్టీల‌కు సొంత పార్టీ నేత‌ల నుంచే తిరుగుబాటు త‌ల బొప్పి క‌ట్టిస్తోంది. ఇదిలా వుంటే గ‌త కొన్ని రోజులుగా సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జన ప‌డుతున్న నాలుగు పార్టీల్లో సీపీఐకి అస‌హ‌నం తారా స్థాయికి చేరింది. ఆ పార్టీని అవ‌మానిస్తూ కాంగ్రెస్ కేవ‌లం రెండు సీట్లు మాత్రమే కేటాయించ‌డం కూట‌మిలో లుక‌లుక‌ల‌కు ఆజ్యం పోసింది.

కాంగ్రెస్ వైఖ‌రితో విసిగొందిన ఆపార్టీ సీనియ‌ర్ నేత చాడ వెంక‌టరెడ్డి ఇలా అయితే కూట‌మి నుంచి త‌ప్పుకుంటామ‌ని కాంగ్రెస్‌కు ఆల్టిమేట‌మ్ జారీ చేయ‌డం, తాము పోటీకి దిగుతున్న తొమ్మిది స్థానాల‌ని ప్ర‌క‌టించ‌డం ఆసక్తిగా మారింది. కొత్త‌గూడెం, వైరా, హుస్నాబాద్‌, బెల్లంప‌ల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల‌, దేవ‌ర‌కొండ‌, పిన‌పాక స్థానాల్లో పోటీ చేస్తామ‌ని చాడ వెంక‌ట‌రెడ్డి స్ప‌ష్టం చేయ‌డం కాంగ్రెస్ ఆశావ‌హుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. అయితే ఇంత ఖ‌రాక‌డీగా తేల్చి చెప్పినా కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో సీపీఐ మ‌హాకూట‌మికి గుడ్‌బై చెప్పి సోలోగానే రంగంలోకి దిగాల‌న్న ఆలోచ‌న‌లో వున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. చివ‌రి ప్ర‌య‌త్నంగా కాంగ్రెస్ స‌ర్దుబాటు ధోర‌ణితో ఆలోచిస్తే మేమూ మ‌రోమారు ఆలోచిస్తామ‌ని, లేదంటే మా ద‌గ్గ‌ర ప్లాన్ బీ రెడీగా వుంద‌ని, దాన్ని అమ‌లు ప‌రిచి 20 సీట్ల‌లో పోటీకి దిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని చాడ వెంక‌ట‌రెడ్డి తేల్చి చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.