పవన్ స్ట్రోక్ బాగానే తగిలింది !

Monday, October 1st, 2018, 02:28:09 PM IST

తెలంగాణలో కోన ఊపిరితో కొట్టుకుంటున్న పార్టీల్లో సిపిఎం కూడ ఒకటి. ఈ పార్టీ నాయకుడు తమ్మినేని వీరభద్రం నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్నారు. భావజాలం రీత్యా తాను కమ్యూనిస్టునని చెప్పుకునే పవన్ ఈసారి తమతో చేతులు కలుపుతారని ఆయన అనుకున్నారు. ఈమేరకు జనసేనకు ఆహ్వానాలు కూడ పంపారు. ఆరంభంలో వీరి ప్రపోజల్ ను ఆమోదించేటట్టే కనబడిన పవన్ ఆ తరవాత వారిని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.

ఆయన ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా క్లారిటీకి రాకపోవడంతో ఈ పొత్తుల్ని దూరం పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నట్టున్నారు. ఈ సంగతిని గ్రహించిన సిపిఎం పెద్దలు కూడ ఇక పవన్ వెనక తిరిగి లాభం లేదనుకుని నిర్ణయించేసుకున్నారు. అందుకే తమకు అందుబాటులో ఉన్న నేతల్ని వెతకడం మొదలుపెట్టి చివరికి బీసీ సంఘాల ఉద్యమకారుడు ఆర్.కృష్ణయ్యను తగులుకున్నారు.

ఆయన్ను సిఎం అభ్యర్థిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరుస్తోందని కొన్ని రోజుల క్రితమే ప్రకటించేసింది. ప్రస్తుతం వీరు ఇతర పార్టీలు ఏవైనా తమకు మద్దతిస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తెలంగాణలో అసలు ఉందో లేదో కూడ తెలియని శివసేన పార్టీ వీరికి మద్దతిచ్చింది. మరి టిఆర్ఎస్ అనే కొండను కట్టిపడేయడానికి ఇలాంటి గడ్డిపోచలు ఎన్నింటిని కలిపితే తాడవుతుందో తమ్మినేనిగారే లెక్కేసుకోవాలి.