సంచలనం రేపుతున్న కథువా తరహా మరొక ఘటన!

Sunday, April 15th, 2018, 06:49:58 PM IST

ప్రస్తుత మానవుడు నూతన ఆవిష్కరణలు, పోకడలతో ముందుకు పోతున్నప్పటికీ మనిషి ఆలోచన విధానం మాత్రం రోజు రోజుకు దిగజారిపోతోంది. మరీ ముఖ్యంగా ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్న కథువా ఘటనలో చిన్నారిని ఎంత అమానుషంగా చెరిచారో తెలిసిందే. కాగా ప్రస్తుతం కథువా, ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో గుజరాత్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరత్‌లో 11సంవత్సరాల ఓ మైనర్‌ బాలికను వారం రోజులు లైంగిక దాడి చేసి, చిత్రహింసలు పెట్టిన మృగాళ్లు, చివరికి గొంతునులిమి హత్యచేశారు. ఏప్రిల్‌ 6న సూరత్‌లోని భెస్తన్‌లోని క్రికెట్‌ మైదానంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్ట్‌మార్టంకు పంపారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలిక మృతదేహంపై 86 గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం అనంతరం పోలీస్ లు తెలిపారు. చెక్కతో చేసిన ఆయుధంతో ఆమె మర్మాంగాలను కూడా మృగాళ్లు గాయపర్చారని వెల్లడించారు. వారంరోజుల పాటు ఆమెను చిత్రవధకు గురిచేసిన అనంతరం చివరగా గొంతునులిమి హత్యచేశారన్నారు. బాలికపై అత్యాచారం జరిగిందా, లేదా తెలుసుకునేందుకు ఆమె నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపామన్నారు. కఠువా, ఉన్నావ్‌ ఘటనల్లో దోషులెవరినీ విడిచిపెట్టబోమని ప్రధాని మోదీ హామీఇచ్చిన మరుసటి రోజే ఆయన సొంత రాష్ట్రంలోనే ఈ దారుణం వెలుగులోకిరావడం గమనార్హం.

కాగా, మృతురాలి గురించి తమకు ఎలాంటి వివరాలు తెలియరాలేదని, ఆమె వివరాలు చెప్పినవారికి రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే ఒకటి వెంట మరొకటి సంఘటనలు జరగడంతో మనిషిలోని మృగత్వం ఈ రకంగా పెట్రేగిపోవడానికి కారణం నేటి మనిషిలోని వికృత ఆలోచనలు,పోకడలు అని. అవి మారనంతవరకు సంఘంలో ఈ రకమైన దురాచారాలు జరుగుతూనే వుంటాయని మానసిక నిపుణులు అంటున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments