క్రికెట్ బెట్టింగ్ : నష్టపోవడమే.. అదే వారి టార్గెట్!

Tuesday, May 15th, 2018, 10:15:31 AM IST

క్రికెట్ సీజన్ మొదలైంది అంటే చాలు నిర్వహిస్తున్న సంస్థలకు కమిటీలకు లాభం ఎంత వస్తుందో గాని అజ్ఞాతంలో బెట్టింగ్ లు నడిపే బూకీలకు మాత్రం కోట్లల్లో లాభాలు వచ్చిపడుతున్నాయి. ఎన్నడు లేని విధంగా ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్ ల జోరు గ్రామాలకు కూడా పాకింది. బుకీలు ఏర్పాటు చేసిన విధంగా ప్రతి మ్యాచ్ పై పందెం కాయడం. ఆ తరువాత నష్టపోవడం ఇందులో లాభాలు ఎంత ఉన్నాయో గాని నష్టపోయేదే ఎక్కువ. 10 వేల నుంచి 10 లక్షల వరకు సాగుతున్నాయి. కోట్లల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఒక్కసారి ఈ వ్యసనం అలవాటు పడితే మానుకోవడం కష్టం.

ముఖ్యంగా యువత ఈ ఊబిలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. బెట్టింగ్ పెట్టి డబ్బులు ఇవ్వకుంటే బుకీలు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. అలాగే డబ్బు కట్టేందుకు కొంత మంది ఇంట్లో నగలు తాకట్టు పెడుతున్నారు. కొందరైతే ఆస్తులనే పనంగా పెడుతున్నారు. 10 వేలకు లక్ష గెలవచ్చు అనే ఆశకి ఆకర్షితులై మోసపోతున్నారు. చివరకు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక పోలీసులకు చిక్కి చాలా మంది జైలుపాలవుతున్నారు.

ఈ తరహా బెట్టింగ్ లను తగ్గించడానికి పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ముంబై – ఢిల్లీ – బెంగుళూర్ వంటి ప్రముఖ నగరాల నుంచి బుకీలు కార్యకలాపాలను నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడా బెట్టింగ్ అనే పదం కనిపించినా పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నమోదైన కేసులు మరెప్పుడు కాలేదని సమాచారం. ఇలాంటి జూదాల వల్ల నష్టపోయే అవకాశమే గాని పెద్దగా లాభాలు ఉండవని డబ్బు ఆశ చూపి మోసం చేయడం బుకీల టార్గెట్ అని పోలీసులు చెబుతున్నారు.