డీఎస్‌ని క‌నిక‌రించ‌ని రాహుల్‌గాంధీ

Thursday, November 8th, 2018, 12:01:58 AM IST

కాలం క‌లిసి రాక‌పోతే ఎంత పేరున్నా..ఎంత అనుభ‌వం వున్నా ఏం లాభం.. ఇలాగే వుంది ఆవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ పీసీసీ అధ్య‌క్షుడు డీఎస్ ప‌రిస్థితి. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న ఆయ‌న ఆ త‌రువాత తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పీసీసీ అధ్య‌క్షుడిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తెలంగాణ‌లో బ‌ల‌మైన నేత‌గా ఎదిగిన ఆయ‌న తెలంగాణ ప్ర‌త్యే రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇక్క‌డి నుంచి ఆయ‌న‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు.

త‌న‌యుల కార‌ణంగా జిల్లాలో రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న డీ. శ్రీ‌నివాస్ త‌ద‌నంత‌ర ప‌రిణామాల కార‌ణంగా తెరాస ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వ‌కుంట్ల క‌విత ఆగ్ర‌హానికి గుర‌య్యారు. జిల్లాలో పార్టీకి వ్య‌తిరేకంగా పావులు క‌దుప‌తున్నార‌న్న అప‌వాదు కార‌ణంగా గులాబీ అధిప‌తికి, గులాబీ శ్రేణుల‌కు దూర‌మై డీఎస్ మ‌ళ్లీ సొంత గూటికి చేరాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన డీఎస్ రాహుల్ గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు. అయినా ఆయ‌న కాంగ్రెస్‌లోకి రీఎంట్రీపై ఎలాంటి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో డీఎస్‌ని రాహుల్ క‌నిక‌రించ‌లేద‌ని ఆయ‌న స‌న్నిహితులే గుస‌గుస‌లాడుతున్నారు.

ఇదిలా వుంటే డీఎస్ అనుచ‌ర‌గ‌ణం అంతా పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. కానీ డీఎస్‌కు మాత్రం పిలుపు రావ‌డం లేదు. అంతే కాకుండా డీఎస్ తెరాస‌ను వీడితే ఆయ‌న‌కున్న ఎంపీ ప‌ద‌వి ఊడే ప్ర‌మాదం వుంది. దీని కార‌ణంగానే డీఎస్ మిగ‌తా వారిలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక‌పై డీఎస్ ఇంకా తాత్సారం చేస్తే రెంటికి చెడ్డ రేవ‌ట‌గా మారే అవ‌కాశం వుంద‌ని ఆయ‌న స‌హ‌చ‌ర వ‌ర్గం భ‌యాన్ని వ్య‌క్తం చేసు్తండ‌టం గ‌మ‌నార్హం.