మ‌ళ్లీ తెర‌పైకి ద‌ళ‌త సీఎం

Thursday, December 6th, 2018, 03:09:21 PM IST

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటింగ్ మ‌రో 24 గంట‌ల్లో జ‌ర‌గ‌నున్న వేళ కొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఈ నెల 11న ఫ‌లితాల‌ త‌రువాత తెలంగాణ‌లో అధికార పీఠం ఎవ‌రిదో…ప్ర‌త్య‌ర్థులుగా ప్ర‌తిప‌క్ష పాత్ర‌కు ప‌రిమిత‌మ‌య్యేది ఎవరో తేలిపోనున్న‌వేళ మ‌హాకూట‌మిలో ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే వాద‌న మొద‌లైంది. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం సాధిస్తే ద‌ళితుడే సీఎం అంటూ కొత్త వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న తెర‌పైకి రావ‌డానికి కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో గులాబీ బాస్ కేసీఆర్ త‌మ పార్టీ గెలిస్తే ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని మాటిచ్చారు కానీ ఫ‌లితాల త‌రువాత మాట మార్చి ముఖ్య‌మంత్రి పీఠంపై తానే కూర్చున్నారు.

ఈ అంశాన్నే త‌మ‌కు అనుకూలంగా మ‌ర్చుకోవాల‌ని చూస్తున్న మ‌హాకూట‌మి 24 గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ త‌మ కూటమి గెలిస్తే ద‌ళితుడే ముఖ్య‌మంత్రి అనే ఫీల‌ర్స్‌ని వ‌దులుతోంది. తెరాస గ‌న‌క విజ‌యం సాధిస్తే ఆ పార్టీ అధినేత‌నే మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడ‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా వుంటే కూట‌మిలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న‌కాంగ్రెస్ నుంచే సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌నుకుంటున్నార‌ట‌. అందులోనూ మెజారిటీ వ‌ర్గం ద‌ళితుడినే సీఎంగా నిర్ణ‌యించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. అలా ద‌ళితుడిని సీఎంను చేయ‌డం వ‌ల్ల కాంగ్రెస్ రెడ్డి వ‌ర్గాల‌కే పెద్ద పీట వేస్తోంద‌నే అప‌వాదును చెరిపేసుకున్న‌ట్ట‌వుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. కేసీఆర్ త‌ర‌హాలోనే కాంగ్రెస్ కూడా మాట‌మార్చడం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని, కేవ‌లం గెలుపు కోస‌మే ద‌ళిత సీఎం అనే వాద‌న‌ను తెర‌పైకి తీసుకొస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు మండిప‌డుతుండ‌టం విశేషం.