టాప్ స్టోరి : వార‌స‌త్వ రాజ‌కీయాల్లో గ్రేట్ ప్రిన్సెస్‌!!

Thursday, October 18th, 2018, 12:44:59 AM IST

రాజ‌కీయ వార‌స‌త్వం అంటే కొడుకుల‌కే అంటే త‌ప్పు! ఇప్పుడు కుమార్తెల‌కు అందులో వాటా ఉంది. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో కూతుర్లు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసి స‌త్తా చాటుకున్న వైనం చ‌రిత్ర‌లో ఉంది. చ‌దువుతోపాటు అన్ని రంగాల‌లో ఆరితేరిన అమ్మాయిలు రాజ‌కీయంగా ముందు వ‌ర‌స‌లో ఉంటున్నారు. స్వాతంత్య్ర స‌మ‌రంలోనూ, ఆ త‌ద‌నంత‌రం కూడా దేశ చ‌రిత్ర‌లో స్థానం పొందిన స‌రోజినీనాయుడు, ఇందిరాగాంధీ లాంటి దిగ్గ‌జ రాజ‌కీయ‌నాయ‌కుల‌ను ఆద‌ర్శంగా తీసుకుని నేటిత‌రం ముందుకు సాగుతున్నారు. తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని రాజ‌కీయంగా ఎద‌గాల‌నే తాప‌త్ర‌యంతో తాము సొంత‌ బాణీని చూపించాల‌ని క‌ల‌లు క‌నేవాళ్ళు ఉన్నారు. తండ్రికి త‌గ్గ వార‌సురాళ్లుగా స‌త్తా చాటిన వారిని ప‌రిశీలిస్తే..

దేశ‌ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌న‌యురాలు శ్రీ‌మ‌తి ఇందిరాగాంధి తండ్రి ఖ్యాతిని ఇనుమ‌డింప‌చేసింది. తండ్రిని మించిన రాజ‌కీయాల‌తో దేశ‌ప్ర‌ధానిగా .. ఉక్కుమ‌హిళ‌గా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు. భార‌త‌రాజ‌కీయాల‌లో ఇందిరాగాంధీ స్థానం ఎంతో గొప్ప‌ది. ఆమె చూపిన మార్గంలోనే ఎంద‌రో వెళుతున్నారు.

భార‌త‌దేశంలోనే కాదు యావ‌త్తు ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌జామోద రాజ‌కీయ‌నాయ‌కుడిగా పేరుపొందారు ఎన్టీఆర్‌.
మ‌హోన్న‌త న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు అన‌తి కాలంలోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయ‌న‌ కుమారులు హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ రాజ‌కీయ వార‌సులుగా ఉన్న‌ప్ప‌టికీ వారి ప్ర‌భావం తెలుగు ప్ర‌జ‌ల‌లో అంత‌గా లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ వాగ్ధాటి వారికి రాలేదు. కానీ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వ‌రి రాజ‌కీయాల‌లో అడుగిడిన నాటినుండి సంచ‌ల‌నాల‌కు తెర‌తీశారు. కాంగ్రెస్ పార్టీలో పార్ల‌మెంటు స‌భ్యురాలుగా రెండు సార్లు ఎన్నిక‌య్యి, కేంద్ర క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టారు. ఎన్టీఆర్ వాగ్ధాటి కుమార్తె పురందేశ్వ‌రికి వ‌చ్చాయ‌ని అంద‌రూ ప్ర‌శంసించారు. అన‌ర్గ‌ళంగా మాట్లాడుతూ భార‌త‌దేశం త‌ర‌పున ప్ర‌పంచ య‌వ‌నిక పై ప్ర‌సంగించిన ఘ‌న‌త ఎన్టీఆర్ త‌న‌య‌కు ద‌క్క‌డం గొప్ప అన్న ప్ర‌శంస ద‌క్కింది. ఇప్ప‌టికీ రాజ‌కీయాల‌లో కీల‌క పాత్ర‌పోషిస్తూ బిజెపి పార్టీ త‌ర‌పున ఉన్నారు. త‌మిళ‌నాడులో క‌రుణానిధి త‌న‌య క‌నిమొళి కూడా తండ్రి వార‌స‌త్వంతో ముందుకు సాగుతున్న‌ది. పార్ల‌మెంటు స‌భ్యురాలుగా ప‌నిచేసి పిన్న వ‌య‌సులో పార్ల‌మెంటులో జంకులేకుండా క‌రుణానిధిలా త‌న ప్ర‌సంగాహోరు త‌మిళ‌తంబీల వాయిస్‌ను వినిపించిన ఘ‌నత‌ క‌నిమొళిద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆ త‌ర్వాత కాలంలో 2జి కుంభ‌కోణంలో కొంత అప‌వాదును మోసినా అవ‌న్నీ రాజ‌కీయాల‌లో ఉన్న‌వాళ్ళ‌కు మామూలే. అటువంటి ఆటుపోటుల‌ను త‌ట్టుకుని త‌మిళ రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకత‌ను చాటుకున్న ఉత్త‌మ రాజ‌కీయ‌నాకురాలు.

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత ఎంపీగా ఎన్నిక‌య్యారు. తెలంగాణ తొలి మ‌హిళా ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా ఘ‌న‌త వ‌హించారు. విదేశాల‌లో ఉన్న‌త చ‌దువుల‌ను అభ్య‌సించిన క‌విత నిర్మోహ‌మాటంగా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడుతూ పేరుపొందారు. ఒక ద‌శ‌లో బిజెపితో టిఆర్ ఎస్ పొత్తు పెట్టుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి. పొత్తు ఉన్న‌ట్ట‌యితే తెలంగాణ కొత్త రాష్ట్రానికి తొలి మ‌హిళా కేంద్ర మంత్రిగా చ‌రిత్ర సృష్టించేవారు. పార్ల‌మెంటులో తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతూ భార‌తదేశంలో అంత‌మంది పార్ల‌మెంటు స‌భ్యుల మ‌ధ్య తొలిసారి ఎంపీగా ఎన్నిక‌యిన క‌విత మాట్లాడుతూ ఉంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డుతుండ‌టంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. త‌న తండ్రి అన‌ర్గ‌ళ ప్ర‌సంగ నైపుణ్యం కుమార్తె క‌విత‌కు అక్ష‌రాలా వ‌చ్చాయ‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. తండ్రి ద‌క్ష‌త‌, నైపుణ్యం, రాజ‌కీయ చ‌తుర‌త అన్నీ కేసీఆర్ కుమార్తె క‌విత‌కు ఆభ‌ర‌ణాలు.

ష‌ర్మిల‌.. పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైఎస్సార్ త‌న‌య‌గా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు ష‌ర్మిల‌. అన్న జైలుకు వెళ్లిన‌పుడు ఓదార్పుయాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు బాగానే చేరువ‌య్యారు. క‌దిలించిన సంఘ‌ట‌న‌తో క‌న్నీరు పెట్టుకున్న అమ్మ మ‌న‌సు అంటూ.. అభిమానుల మ‌న్న‌న‌లు అందుకున్నారు. పైగా జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అంటూ ఎమోష‌న్ బాగానే పండించారు. నాలుగైదు నెల‌ల పాటు జ‌నంలో ఉన్న ఆమెకు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థ‌మే ప‌ట్టార‌నాలి. కొన్ని సంద‌ర్భాల్లో అయితే.. వైఎస్ బాడీలాంగ్వేజ్‌.. మాట‌తీరు.. అచ్చు నాన్న‌లాగానే ఉందంటూ. అభిమానులు ప్ర‌శంస‌లూ అందుకున్నారు. చివ‌ర్లో.. అర్రే.. జ‌గ‌న్ అన్న కంటే.. ష‌ర్మిల అక్క‌ సూప‌ర్ క‌ద‌రా! అనుకుంటూ వైఎస్ అభిమానులు.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు నోటిమాట‌లు వినిపించాయి. మ‌రి అక‌స్మాత్తుగా ఏమైందో ఏమోగానీ.. ష‌ర్మిల జ‌నం మ‌ధ్య నుంచి దూర‌మ‌య్యారు. చెల్లెల‌ను ఎలా రాజ‌కీయంగా ఎద‌గ‌నిస్తాడంటూ కూడా ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. ఇదే స‌మ‌యంలో కొన్ని రూమ‌ర్స్ ష‌ర్మిల‌పై సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొట్టాయి. అది మాన‌సికంగా ష‌ర్మిల ఆవేద‌న‌కు కార‌ణ‌మ‌య్యాయి. చివ‌ర‌కు దీనిపై వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌ట‌మే కాదు.. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల వ‌ర‌కూ చేరింది. ఇదంతా కొంద‌రు కావాల‌నే ఆమెపై చెడు ప్ర‌చారం చేసిన‌ట్లు తేల్చారు. ఇటు అన్న నుంచి స‌రైన తోడ్పాటు లేక‌పోవ‌టం.. గృహిణిగా.. రూమ‌ర్స్ కుటుంబంపై ప్ర‌భావం చూప‌టం ఆమెను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచేందుకు కార‌ణ‌మంటున్నారు వైసీపీ నేత‌లు. ఈ క్ర‌మంలో వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని సీమ జిల్లాల్లో పార్టీని గెలిపించి, న‌డిపంచే బాధ్య‌త‌ను ఆయ‌న త‌న త‌ల్లి, చెల్లి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌కు అప్ప‌గిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ బ‌లంగా ఉంది. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అంటూ ష‌ర్మిల జ‌నంలోకి దూసుకుపోయిన విష‌యం తెలిసిందే.

ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్‌గాంధి కుమార్తె ప్రియాంక గాంధి కూడా రాజ‌కీయాల‌లో ఉన్నారు. తండ్రి వార‌స‌త్వాన్ని కొడుకు రాహుల్‌గాంధీ కంటే కూడా కూతురు ప్రియాంక గాంధీ మంచి ఇమేజ్‌ను పొందారు. రాజ‌కీయ పండితులు ఇప్ప‌టికీ ప్రియాంక‌గాంధీ పూర్తి స్థాయి రాజ‌కీయాల‌తో వ‌స్తే కాంగ్రెస్‌కు గ‌త‌వైభ‌వం వ‌స్తుంద‌నే ఆశను వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి అంత‌టికీ కార‌ణం ప్రియాంక గాంధీ నానమ్మ ఇందిరాగాంధీలా పోలిక ఉండ‌ట‌మే కాకుండా రాజ‌కీయా స‌మావేశాల్లో ఆ చొర‌వ ప్ర‌శంస‌నీయ‌మే. ఇక న‌వ‌త‌రంలో భూమా నాగిరెడ్డి- శోభా నాగిరెడ్డిల వార‌సురాలు అఖిల‌ప్రియ రాజ‌కీయాల్లో రాణిస్తున్న తీరు ప్ర‌శంస‌నీయం. ఇలా ప‌రిశీలిస్తే ఎంద‌రో నేటిత‌రం వార‌సురాళ్లు రాజ‌కీయాల్ని శాసిస్తుండ‌డం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments