చంద్ర‌బాబుకు డెడ్‌లైన్.. రాజ‌కీయ వ‌ర్గాల్లో. హాట్ టాపిక్‌గా మారిన‌ అక్టోబ‌ర్ – 15..!

Friday, October 12th, 2018, 01:54:16 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును బాబ్లీ కేసు త‌ల‌పోటుగా త‌యారైంది. 2010 జూలై 16వ తేదీన అప్పుడు విప‌క్షంలో ఉన్న‌ టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు కొంత‌మంది టీడీపీ నాయ‌కులు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టినందుకు నాడు చంద్ర‌బాబుతో స‌హా ప‌ల‌వురు నేత‌ల‌ను మ‌హారాష్ట్ర పోలీసుల‌ అరెస్టు చేసి కేసున‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి చంద్ర‌బాబు స‌హా ప‌లువురు టీడీపీ ప్ర‌తినిధులు ఆటంకం క‌ల్గించార‌ని.. అందుకే వారి పై కేసు న‌మోదు అయ్యింద‌ని.. దీంతో ఆ కేసు విష‌య‌మై చంద్ర‌బాబుతో స‌హా మొత్తం 16 మందికి ఈ ఏడాది సెప్టంబ‌ర్‌లో ధ‌ర్మాబాద్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్‌ను ఇష్యూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ కేసులో ఉన్న 16 మంది సెప్టెంబర్ 21న కోర్టుకు హజరుకావాలని ధ‌ర్మాబాద్ కోర్టు ఆదేశించింది.

దీంతో మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, గంగుల కమలాకర్, ప్రకాష్‌గౌడ్‌లు ధర్మాబాద్ కోర్టుకు హజరయ్యారు. దీంతో వారికి ధ‌ర్మాబాదు కోర్టు సెప్టెంబర్ 21న బెయిల్ మంజూరు చేసింది. అయితే 16మందిలో ఒక‌రైన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ధ‌ర్మాబాదు కోర్టుకు హాజ‌రు కాలేదు. దీంతో తాజాగా అక్టోబ‌ర్ 11 గురువారం నాడు ధర్మాబాద్ కోర్టులో చంద్ర‌బాబు తరపు న్యాయ‌వాదులు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ కేసు విచార‌ణ అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేస్తూ.. ఈసారి అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హజరుకావాలని.. ప్ర‌జాప్ర‌తినిథులు అయినంత మాత్రాన వారికి ప్ర‌త్యేక మిన‌హాయింపులేం ఉండ‌వ‌ని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో చంద్ర‌బాబు అక్టోబ‌ర్ 15వ తేదీన బాబ్లీ కేసు విచార‌ణ నిమిత్తం కోర్టుకు హాజ‌రు అవుతారో లేదో చూడాలని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ మొద‌లైంది.