కూటమికి ఓటమి తథ్యం…

Thursday, November 8th, 2018, 04:58:02 PM IST

యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాణి రుద్రమదేవి లు బీజేపీతో కలిసి పనిచేసేందుకు పూనుకున్నారు. యువ తెలంగాణా పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవీలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి చర్చలు జరిపారు. సమావేశం తరువాత బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ దేవీలు బీజేపీతో కలిసి పని చేస్తామని తెలిపినందుకు సంతోషిస్తూ వారికి హృదయపూర్వక స్వాగతం పలికారు. వీలైతే ఈ ఎన్నికలలో మేము కలిసి పోటీ చేస్తామని, అనేక సంఘాలు, చిన్న పార్టీలు కూడా సంప్రదిస్తున్నాయని మీడియా తో చెప్పుకొచ్చారు. టీడీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఈసారి అధికారం లోకి వచ్చేది బీజేపీ అని, తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. అవినీతి మరియు కుటుంబ రాజకీయాలు లేని ఏకైక పార్టీ కేవలం బీజేపీ అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో చంద్రబాబు అన్న విషయాన్నీ గుర్తు చేస్తూ, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కలిసేవే ఈ పార్టీ లు అని ఎద్దేవా చేసారు.

యువ తెలంగాణ పార్టీ, బీజేపీ పొత్తు నూతన భవిష్యత్తు కి శ్రీకారం చుడుతుందని అన్నారు. అన్ని అవమానాలు భరించి సీట్ల కోసమే కోదండరాం, సీపీఐ అందులో ఉన్నారు. ఇది పచ్చి అవకాశవాద కూటమి అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఓటమి అంచున ఉన్న పార్టీ అని, ఇంకా అనేక మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదని అందుకే తమపై అవసరంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమసమయంలో యువ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషిందని గుర్తు చేశారు. జాతీయ భావంతో, దేశ అభివృద్ధిని చూసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణాని విచ్చిన్నం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు చేశారని యువ తెలంగాణా పార్టీ అధ్యక్షులు జిట్టా బాల కృష్ణ రెడ్డి తెలిపారు.