ఏపీ పార్టీలను కలవరపెడుతున్న ఢిల్లీ సర్వే రిపోర్టులు

Wednesday, May 30th, 2018, 02:52:24 PM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన రీతిలో ఇప్పటినుండే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నాయి. టీడీపీ ప్రస్తుతం మహానాడు కార్యక్రమం నిర్వహించి కేంద్రం చేసిన అన్యాయాలను, మోసాలను ప్రజలకు తెలియచేస్తోంది. అలానే వైసిపి అధినేత జగన్ కేవలం అధికారం కోసమే పాదయాత్రలు చేపడుతున్నారని, జగన్ పవన్ లు కేంద్రం లోని బిజెపి అడుగుజాడల్లో నడుస్తూ యాత్రల్లో వారు చెప్పినట్లు మాట్లాడాడుతున్నారని టీడీపీ దుయ్య బట్టింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి కూడా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, చంద్రబాబు కేవలం మాటల బాబేనని, చేతల బాబు కాదన్న రీతిలో కొన్ని రకాల టీడీపీ తప్పిదాలను ప్రజలముందు ఎత్తి చూపుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ తాను ప్రజల సంక్షేమం కోసమే అప్పట్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చానని, ఇప్పుడు తెలుస్తోంది అది ఎంత పెద్ద తప్పో అని, టిడిపి నేతలు, తమకు దొరికినంత ఎవరికి అందింది వారు దోచుకుంటూ ప్రజాసంక్షేమం పూర్తిగా గాలికి వదిలేశారని, జగన్ నేతృత్వంలోని వైసిపి అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ అవినీతిపై నిలదీయాలని అసలు అసెంబ్లీకే వెళ్లకపోతే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని పవన్ అంటున్నారు.

ఇలా మూడు పార్టీల అధినేతలు ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో తమ తమ పార్టీలకే ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు. ఇక ఇది అటుంచితే, ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో ఢిల్లీ కి చెందిన ఒక ప్రముఖ సర్వే సంస్థ అక్కడి రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు సేకరించింది. అయితే ఆ తరువాత పనిలోపనిగా మన ఏపీలో కూడా ఇక్కడి నేతలపై ప్రజల మనోగతం ఏమిటో ఒక సర్వే నిర్వహించిందట. అయితే ఆ రిపోర్టులో అన్ని పార్టీలను కలవరపెట్టే కొన్ని నిజాలు బయటపడ్డట్లు సమాచారం. ప్రస్తుతము చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పాలన బాగుందని, ఆయన రాజకీయ అనుభవం వలన రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంలేదని, అంతేకాక నెల నెలా పెన్షన్లు, రేషన్ సకాలంలో అందుతోందని, రోడ్లు వేయిస్తున్నారు, ముఖ్యంగా విద్యుత్ సమస్యలు లేకపోవడంవల్ల గ్రామీణులు ఇబ్బందులు తగ్గాయని అన్నారట. అలానే ఎమ్యెల్యేల అవినీతి బాగా పెరిగిందని, ఓట్ల సమయంలో మాత్రం మంచి ఉత్సాహంతో వస్తారని, ఆ తర్వాత మాకు సమస్యలొస్తే పట్టించుకోవడంలేదని పెదవి విరుస్తున్నారట. ఇక కేంద్రబిజెపి రాష్ట్రానికి అన్యాయం చేయడం విషయమై బీజేపీ పై ప్రజల్లో తీవ్ర వెతిరేకత ఉందని తెలుస్తోందట.

అలానే ఇదివరకు కంటే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బాగా పెరిగిందని అంటున్నారు. ఇక వైసిపి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడ్డారట, అలానే ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఎక్కువగా చంద్రబాబు, టీడీపీ వైఫల్యాలనే ఎండగడుతున్నారే కానీ, ఆయన చేయబోయే కార్యక్రమాలను గురించి వివరించడంపై పెద్దగా దృష్ట పెట్టడం లేదని అంటున్నారు. ఇక జగన్ తాను అధికారంలోకి వస్తే పెన్షన్ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తాను అనే హామీ బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందట. ఇక జనసేన అధినేత పవన్ పై కూడా కొందరు సుముఖంగా వున్నారని, కాకపోతే ఈ సర్వే చేపట్టేనాటికి ఆయన యాత్ర ఇంకా ప్రారంభించలేదని, అందువల్ల వెల్లడైన మేరకు జనసేనను కూడా ప్రజలు బాగానే విశ్వసిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే మొత్తంగా రానున్న ఎన్నికలు ఏపీలో మంచి రసవత్తరంగా సాగుతాయని, ఇక ఆసమయంలో ఎవరు కింగ్ అవుతారో, ఎవరు కింగ్ మేకర్ అవుతారో తెలియాలంటే అప్పటివరకు ఆగవలసిందే మరి…..

  •  
  •  
  •  
  •  

Comments