డిప్యూటీ సీఎం ఫైర్: మోడీకి జగన్ అమ్ముడుపోయాడు..!

Friday, January 11th, 2019, 02:25:39 PM IST

వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు అండ్ కో అవినీతి ఆరోపణలు చేయటం మాములే, కొన్ని సందర్భాల్లో అయితే మరీ దారుణంగా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దానికి జగనే బాద్యుడు అని ఆరోపించేవారు. 2014లో టీడీపీ బీజేపీలు కలిసి బరిలో దిగిన సందర్భంలో జగన్ కాంగ్రెస్ లో కలిసిపోయాడని, కాంగ్రెస్ ను తల్లి కాంగ్రెస్ అని, వైసీపీ పిల్ల కాంగ్రెస్ అనిఎం జగన్ ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్టే అని విమర్శించారు. ఇపుడు బీజేపీకి విడాకులు ఇచ్చాక మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని, జగన్ మోడీతో కలిసిపోయాడని అంటున్నారు. జగన్ కు ఓటేస్తే రాష్ట్రాన్ని ముంచేసిన బీజేపీకి, మోడీకి ఓటేసినట్టే అని అంటున్నారు చంద్రబాబు. జగన్ పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఈ విమర్శలు జోరు మరింత పెంచారు చంద్రబాబు అండ్ కో.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జగన్ పై విరుచుక పడ్డారు,మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ అవినీతి చక్రవర్తి అని, రాష్ట్రానికి మోడీ అన్యాయం చేస్తుంటే జగన్ ఎందుకు ప్రశ్నించట్లేదు అని నిలదీశారు. కేసుల కోసం జగన్ మోడీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. వైఎస్ సీఎం కాకముందు కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి ఉండేదని, ఆయన సీఎం అయ్యాక వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అయితే ఇక్కడ కేఈ ఒక విషయం మరచినట్టున్నారు, 2014లో చంద్రబాబు సీఎం కాకముందు హెరిటేజ్ విలువ ఎంత?, ఆయన సీఎం అయ్యాక హెరిటేజ్ విలువ ఎంత మేరకు పెరిగిందో కేఈ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది.