కూతకెళ్ళి తొడ కొట్టిన ధోని…

Tuesday, November 13th, 2018, 07:02:46 PM IST

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం టీమిండియా మ్యాచ్‌లు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత టీ20ల నుంచి ధోనీని తప్పించిన సెలక్టర్లు, అతని స్థానంలో రిషబ్ పంత్‌ని ఎంపిక చేసారు. దీంతో ఈ నెల 1 నుంచి ఖాళీగా ఉన్న ధోని ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా కాసేపు కబడ్డీ మ్యాచ్ ఆడాడు. ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాళ్లని తలపిస్తూ ప్రత్యర్థి కోర్టులోకి కూతకెళ్లిన ధోని, ఒకరిని ఔట్ చేసి తొడగొట్టడం విశేషం. ఈ ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌కి ధోని ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఈనెల 21 నుంచి ప్రారంభంకానుండగా, ధోనీ మాత్రం వచ్చే ఏడాది వరకూ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లేకపోయింది. తొలుత ఆసీస్‌తో మూడు టీ20లు ఆడునున్న టీమిండియా.. ఆ తర్వాత డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టులు ఆడనుంది. అవి ముగిశాక.. జనవరి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. ఈ వన్డే సిరీస్‌తో ధోనీ మళ్లీ భారత జెర్సీని ధరించనున్నాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి సెలక్టర్లు ఎంపిక చేయని విషయం తెలిసిందే.