ధోని – విరాట్..ఆ రికార్డుల కోసం వెయిటింగ్!

Saturday, February 24th, 2018, 10:30:18 PM IST

నేడు భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్లు చెరోక విజయాన్ని అందుకోగా ఇప్పుడు మూడవ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. మూడు టీ20 ల సిరీస్ ను ఇప్పుడు ఎవరు దక్కించుకుంటారో అందరు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. మూడవ మ్యాచ్ లో విజయంతో పాటు రెండు రికార్డులు కూడా ఊరిస్తున్నాయి. మాజీ కెప్టెన్ ప్రస్తుత కెప్టెన్ ఈ రోజు సరికొత్త గుర్తింపులను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

మాజీ కెప్టెన్ ఎమ్ఏస్.ధోని ప్రపంచంలో ది బెస్ట్ వికెట్ కీపర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోని ఈ రోజు జరిగే మ్యాచ్ లో గనక ఒక్క క్యాచ్ పట్టినా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక క్యాచ్ లు పట్టిన కీపర్ గా గుర్తింపు దక్కించుకుంటాడు. ఇప్పటికే ధోని టీ20ల్లో 49 క్యాచ్ లు పట్టాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో తనకు ఎవరు సాటి రారని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి టీ20ల్లో 57 మ్యాచ్ లు ఆడి 50.85 సగటుతో మొత్తంగా 1,983 పరుగులు సాధించాడు. ఇంకో 17 పరుగులు సాధిస్తే 2000 రన్స్ క్లబ్ లోకి వెళ్లిన మొదటి భారత ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు.

అయితే నేటి టీ20లో ఆ రికార్డ్ కోహ్లీ ఈజీగా అందుకుంటాడని చెప్పవచ్చు. టీ20 ల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న మార్టిన్‌ గప్తిల్‌ 75 మ్యాచ్‌ లలో 2,271 పరుగుల చేశాడు. ఇక ఆ తరువాత ఉన్న బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ 71 మ్యాచ్‌ లలో 35.66 2,140 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ వారి తరువాత స్థానంలో ఉన్నాడు. మరికొన్ని మ్యాచ్ లు ఆడితే విరాట్ ఈజీగా మొదటి స్థానాన్ని అందుకుంటాడని చెప్పవచ్చు.