భార్య అడిగినందుకు ధోని సిక్స్ కొట్టేశాడు!

Thursday, April 26th, 2018, 03:50:46 PM IST

మహేంద్ర సింగ్ ధోని ఒక్కసారి ఫామ్ లోకి వస్తే గ్రౌండ్ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక సిక్స్ రిప్లై చూపించేలోపే మరో సిక్స్ కనిపిస్తుంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా ధోని తన భార్య కోసం సిక్స్ బాదేశాడు. ఇది అనుకోకుండా జరిగినా సోషల్ మీడియాలో మాత్రం సాక్షి అడిగినందుకు ధోని బంతిని బౌండరీకి తరలించడాన్ని కామెంట్స్ వస్తున్నాయి. అందుకు సంబందించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

బెంగుళూర్ తో జరిగిన మ్యాచ్ లో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సింపుల్ గా ఛేదించింది. ధోని 34 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 19 ఓవర్లో ధోని సిక్స్ కొట్టగా ఆ తరువాత బంతికి కూడా మరో సిక్స్ కావాలని సాక్షి కోరింది. ఇంకేముంది ఆ తరువాత ధోని ఏ మాత్రం తగ్గలేదు. భార్య మాట మనసుకు తాకిందో ఏమో మరి వరుస బౌండరీలతో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. దీంతో అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.