ఈ పాపంలో బాలయ్య భాగమెంత ?

Friday, November 2nd, 2018, 11:40:50 AM IST

తెలుగు దేశం కార్యకర్తలకు మరో మర్చిపోలేని రోజు నిన్నటి రోజు. ఆనాడు చంద్రబాబు రాజకీయానికి అన్నగారు విలవిల్లాడిన రోజునే ఈనాటికీ సీనియర్ తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేకుంటే బాబుగారు నిన్న కాంగ్రెస్ తో దోస్తీ కట్టడం వారిని మరింత వేధిస్తోంది. కొందరైతే ఎవరి పార్టీని ఎవరు ఆడిస్తున్నారు, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నట్టు, అసలు చంద్రబాబు ఈ పొత్తు విషయంలో ఎన్టీఆర్ కుమారుడు, పార్టీకి అసలు సిసలు వారసుడు బాలక్రిష్ణ సలహా ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఎప్పటిలాగే పక్కనబెట్టేశారా అని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు.

నిజమే మరి చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ పట్ల ఏమాత్రం గౌరవమున్నా నిన్న రాహుల్ గాంధీని కలిసే ముందు పార్టీలో ఉన్న ఒకే ఒక్క నందమూరి వారుసుడు బాలక్రిష్ణ అభిప్రాయాన్ని కూడ పరిగణలోకి తీసుకుని ఉండాలి. కానీ తీసుకున్నారో లేదో ఎవరికీ తెలీదు. బాలయ్య కూడ బావ చేసిన పని మీద ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఒకవేళ సలహా తీసుకుని, పొత్తుకు బాలయ్య సరే అని ఉండి ఉంటే ఆయన కూడ బాబుతో కలిసి ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు పొడిచి పాపంలో పాలు పంచుకున్నట్టే. ఒకవేళ అసలు బాబు బాలయ్యను సలహా అడగనేలేదంట పార్టీలో ఆయనొక షో పీస్ అన్నట్టే లెక్క.

వీటిలో ఏది నిజమైనా బాబు మాత్రం చేయాల్సిన పని చేసేశారు. ఇక బాలక్రిష్ణ చేయాల్సిన పనల్లా బావ పురామాయించిన ప్రతి చోటుకీ వెళ్లి ఇన్నాళ్లు తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ మాట్లాడటమే.