చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం ఉందా? : వైసిపి నేత పార్ధ సారధి

Saturday, March 31st, 2018, 12:05:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అధికార టిడిపి నేతలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నారని, అసలు మనకు ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిందే చంద్రబాబునాయుడు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధ సారధి అన్నారు. అప్పుడేమో హోదా బదులు ప్యాకెజీ అన్న బాబు, ప్రస్తుతం జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆయనకు జనంలో ఎక్కడ మంచి పేరు వస్తుందో అని బాబు భయపడుతున్నారని అన్నారు.

ఇప్పటికే టిడిపి ప్రభుత్వం పని రాష్ట్రం లో అయిపోయిందని ఆ పార్టీ నేతలు,నాయకులకు అర్ధమయిందని ఆయన ఎద్దేవా చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ నేత పార్థసారథి సవాల్ విసిరారు. హోదాపై జరుగుతున్న ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేద్దామని తాము పిలుపునిస్తుంటే, చంద్రబాబు మాత్రం కలసి రావడం లేదని విమర్శించారు.

తనపై నమోదైన కేసుల్లో విచారణ జరుపుతారేమోననే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే హోదాపై పోరాటంలో ఆయన వెనకడుగు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజీనామాలతోనే టీఆర్ఎస్ నేతలు తెలంగాణను సాధించుకున్నారని పార్థసారథి చెప్పారు. ఇప్పటికైనా మోసాలు, కపట నాటకాలను చంద్రబాబు ఆపాలని అన్నారు. కనీసం ఎన్నికలముందు ఈ కొద్దిరోజులైనా ప్రజల పక్షాన నిలబడి తమ పార్టీ పరువు నిలుపుకోవాలని ఆయన అన్నారు….