పన్నీర్ బాటలో పళని.. ఎవరు ఎవరికి శత్రువు..?

Thursday, February 23rd, 2017, 03:55:41 AM IST


తమిళనాడు రాజకీయాల్లో ఎవరు ఎవరికి శత్రువుగా మారుతారో ఊహించడం కష్టంగా మారుతోంది. జయకు వీర విధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం శశికళకు ఎదురు తిరిగాడు. అన్నా డీఎంకే కి, డీఎంకే కి క్షణం పడదు. అలాంటిది పన్నీర్ స్టాలిన్ తో చేతులు కలుపుతాడా అనే ఊహాగానాల కూడా వచ్చాయి.దీనితో పన్నీర్ సెల్వం శశికళ వర్గానికి బద్ద శత్రువుగా మారిపోయాడు. శశికళ తన అనుచరుడైన పళని స్వామిని ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు అతడిని కూడా ఆమె నమ్మడం లేదా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. శశికళ సుదీర్ఘంగా నాలుగేళ్లపాటు జైలులోఉండాలి. ఈ లోపు ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంది. నేడు పన్నీర్ సెల్వం ఎదురు తిరిగినట్లే రేపు పళని స్వామి పదవి కోసం ఎదురు తిరగడని గ్యారెంటీ ఏంటి ? అనే అనుమానం శశికళలో మొదలైనట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా అన్నా డీఎంకే పార్టీ తన గుప్పెట్లో ఉండాలంటే సీఎం కూడా తన బంధువే అయిఉండాలి అని శశికళ భావిస్తోందట.

దీనికోసం తన అక్క కొడుకు దినకర్ ని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తోందట. జైలు నుంచే దీనికి సంబందించిన ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వాదనకు బలం చేకూరేలా అన్నా డీఎంకే ఎమ్మెల్యే తంగుదురై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. త్వరలోనే దినకర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు.తంగుదురై వ్యాఖ్యలతో పళని స్వామి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే సమయం దగ్గర పడిందనే చర్చ జోరుగా సాగుతోంది. దినకర్ నే ముఖ్యమంత్రిని చేయాలని చిన్నమ్మ భావించే క్రమంలో పళనిస్వామి శశికళకు ఎదురు తిరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.ఈ పరిణామాల్ని చూస్తుంటే సమీప భవిష్యత్తు లో తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే శశికళకు విరోధిగా మారిన పన్నీర్ తో పళని కలిసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.