వాటే షాట్ : సిక్స్ కొట్టి ఇండియాని గెలిపించిన డీకే!

Sunday, March 18th, 2018, 11:21:31 PM IST

దమ్ము అనేది ప్రదర్శించేది కాదు.. సమయాన్ని బట్టి అదే బయటకు వస్తుంది అనే మాట నిజమని ఇండియన్ క్రికెట్ ప్లేయర్ దినేష్ కార్తిక్ తన ఆటతో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐపీఎల్ లో కార్తీక్ కోసం వేలం పాట ఎందుకు అంత రసవత్తరంగా సాగిందో బాంగ్లాదేశ్ తో అతడు ఆడిన బట్టి చెప్పవచ్చు. దినేష్ కార్తీక్ సమయాన్ని బట్టి జట్టుకు అవసరమైనప్పుడు ఎన్ని పరుగులైన రాబట్టగలడు అని సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. కేవలం 8 బంతులతో 29( 3 సిక్సులు – 2 ఫోర్లు) పరుగులు చేసిన కార్తీక్ జట్టుకు ట్రై సిరీస్ లో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

5 పరుగులు చేయాలి. కానీ ఒక బంతి మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్ మ్యాచ్. ఆ సమయంలో ఎలాంటి బ్యాట్స్ మెన్ అయినా సరే ఒత్తిడికి లోనుకాకుండా ఉండలేడు. కానీ కార్తీక్ మాత్రం ప్రెజర్ ని తట్టుకొని అదును చూసి చివరి బంతిని బౌండరీ అవతలకు బాదాడు. ఆ షాట్ తో ఒక్కసారిగా భారత క్రికెట్ అభిమానులకు ఫెవెరెట్ ప్లేయర్ అయిపోయాడు ఈ ఆటగాడు. చివరి నిమిషం వరకు బంగ్లా అభిమానులు గెలుపు మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ దినేష్ కార్తీక్ వచ్చి 8 బంతులల్లో వారి లాక్కుని భారత్ వైపు తిప్పాడు. ఎట్టకేలకు 4 వికెట్లతో ఇండియా విజయాన్ని అందుకుంది.
ఆదివారం బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన బాంగ్లాదేశ్ జట్టు నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. షబ్బీర్ రెహమాన్ (77) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక 167 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇండియా జట్టు మొదట్లోనే దూకుడుగా ఆడింది. అయితే బాంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ 56 పరుగులు చేయగా లోకేష్ రాహుల్ 24 , మనీష్ పాండే 28 పరుగులు చేసి అవుటయ్యారు. చివరి రెండోవర్లలో జట్టుకు 30కి పైగా పరుగులు కావలసిన సమయంలో మనీష్ పాండే ఔటవ్వగానే దినేష్ కార్తీక్ బ్యాటింగ్ కు దిగాడు. 19 ఓవర్లలో రూబెల్ హాసన్ వేసిన ఓవర్లో (6+4+6+0+2+4) 22 పరుగులు రాబట్టి ఒత్తిడి తగ్గించాడు. ఆ తరువాత చివరి ఓవర్లో సౌమ్య సర్కార్ బాగానే బౌలింగ్ చేసినా తడబడ్డాడు. చివరి రెండు బంతులకు 5 పరుగులు కావాల్సిన సమయంలో విజయ్ శంకర్ ఔటవ్వడంతో ఒక బంతికి 5 పరుగుల రాబట్టాలి. స్ట్రైకింగ్ కు వచ్చిన కార్తీక్ సిక్స్ కొట్టడంతో ఇండియా 168 పరుగులు చేసి విజయం సాధించింది.