జగన్ బయట.. పార్టీ లోపల కొట్లాట !

Sunday, September 16th, 2018, 04:32:45 PM IST

ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 8 నెలలుగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రోడ్ల మీదే తిరుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలాగూ నామం పెట్టిన ఆయన కనీసం సొంత పార్టీలో ఏం జరుగుతుందో కూడ పూర్తిగా తెలుసుకోవడంలేదని, పార్టీ లీడర్ల మనోగతాలను బేరీజు వేయలేకపోతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.

వాటికి సాక్ష్యాలు అన్నట్టు గతంలోనే రామచంద్రాపురం టికెట్ల కేటాయింపులో చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణకు పార్టీ టికెట్‌ ఇవ్వటంతో అసమ్మతి సెగలు భగ్గుమని అధ్యక్షుడిని ప్రశించేలా నిరసన వర్గం పుట్టుకొచ్చింది. అలాగే ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వరికూటి అశోక్ ను సమన్వయకర్తగా తొలగించి వేరొకరిని నియమించడంతో వర్గ విబేధాలు తలెత్తాయి. ఇక తాజాగా బెజవాడలో సెగ రాజుకుంది,

బెజవాడ వైసీపీలో ముఖ్యుడైన వంగవీటి రాధా మొదటి నుండి బెజవాడ సెంట్రల్ నుండి పోటీచేయాలని ఆశపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన్ను బందర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయించాలని భావించిందట. దీంతో ఆగ్రహించిన రాధ ఈరోజు జరిగిన పార్టీ వాణిజ్య సమావేశం నుండి మధ్యలోనే నిష్క్రమించారు. అలాగే ఆయన సమ్మతి లేకుండానే బెజవాడ సెంట్రల్ నుండి గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం జరగడం ఆయనకు మరింత కోపాన్ని తెప్పించిందట. మరి ఈ అంతర్గత పోరులన్నీ కలిసి తుది దశ టికెట్ల కేటాయింపు నాటికి పార్టీని తలకిందులు చేయక మునుపే జగన్ మేలుకుంటే మంచిది.

  •  
  •  
  •  
  •  

Comments