వైరల్ : మీ ఫోన్ లో వాట్సాప్ ప్లస్ ఉందా…..?

Thursday, April 5th, 2018, 01:00:38 AM IST

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం ఎక్కువయిన నేటి కాలంలో అందరూ ప్రతి చిన్న విషయాన్ని కూడా వాట్సాప్ లో షేర్ చేయడం సర్వసాధారణమైంది. అసలు నిద్ర లేచింది మొదలు మళ్లి పడుకునేవరకు వాట్సాప్ లోనే కాలం గడిపేవారు మనలో చాలామందే వున్నారు. అయితే, దీనికున్న క్రేజ్ చూసి కొందరు మాయగాళ్లు వాట్సాప్ ప్లస్ పేరుతో ఓ యాప్ ను రూపొందించి యూజర్ల సమాచారాన్ని రాబడుతున్న విషయం బయటకు వచ్చింది. వాట్సాప్ ప్లస్ పేరుతో ఉండే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలన్నీ సేకరిస్తున్నట్టు మాల్వేర్ బైట్స్ ల్యాబ్ అనే సంస్థ వెల్లడించింది.

ఏపీకే ఫైల్ రూపంలో ఉండే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత బంగారం రంగులో వాట్సాప్ ఐకాన్ దర్శనమిస్తుంది. ఇన్ స్టాల్ తర్వాత అగ్రీ, కంటిన్యూ అని ఓకే చేస్తే గడువు తీరిపోయిందని, తిరిగి ఇన్ స్టాల్ చేసుకుని, అప్ డేట్ చేసుకోవాలన్న సందేశం కనిపిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి తాజా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తుంది. అక్కడ ఓకే చేస్తే అంతా అరబిక్ లో ఉండే ఓ అనుమానాస్పద వెబ్ సైట్ కు తీసుకెళుతోంది అని మాల్వేర్ బైట్స్ తెలిపింది.

ఈ యాప్ లో అందుకున్న సందేశాలు కనిపించకుండా చేసే హైడింగ్ ఆప్షన్ ఉందని, వాయిస్ క్లిప్ కూడా కనిపించకుండా చేసుకోవచ్చని పేర్కొంది. ఈ యాప్ నిర్వాహకుల సమాచారం లేకపోవడంతో నమ్మతగినది కాదని మాల్వేర్ బైట్స్ సూచించింది. అయితే అత్యంత ప్రమాదకరమైన ఈ యాప్ కి వినియోగదారులు దూరంగా ఉండాలని, ఈ యాప్ బారినపడి తమ వ్యక్తిగత సమాచారాన్ని హాకర్ ల బారిన పడేయొద్దని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ అప్ ఒకవేళ మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసి ఉంటే ఇప్పుడే అన్ ఇన్స్టాల్ చేసి, మీ ఫోన్ లోని డేటా భద్రం చేసుకోండి మరి…

  •  
  •  
  •  
  •  

Comments