ఆసియలోని కుబేరుల్లో అంబానీ ర్యాంక్ ఎంతో తెలుసా?

Wednesday, April 4th, 2018, 06:58:11 PM IST

ముకేశ్ అంబానీ ఈ పేరు భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత అయిన ముకేశ్ తన ఆస్తిని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన భారతీయ అత్యంత ధనవంతుల జాబితాలో ప్రధమ స్థానం పొందిన ఆయన ప్రస్తుతం బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఇక బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ టాప్‌ 100 జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద సుమారు 38.3బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ జాబితా టాప్‌ 100 లో అంబానీతో పాటు మరో నలుగురికి స్థానం దక్కింది.

లక్ష్మీ మిట్టల్‌ 51వ స్థానం, పల్లోంజీ మిస్త్రీ 61వ స్థానం, విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ 66వ స్థానం, హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌‌‌ 85వ స్థానంలో ఉన్నారు. నిన్న విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ టాప్‌ 500 జాబితాలో మొత్తం 24 మంది భారతీయులకు చోటు దక్కింది. ఇక ఈ కుబేరుల జాబితాలో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బిజోస్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద ఈ ఏడాది 21.8 బిలియన్‌ డాలర్లు పెరిగింది. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఉన్నారు. ఆయన సంపద ఈ ఏడాది 1.36బిలియన్‌ డాలర్లు తగ్గింది…..