35 వేల అడుగుల ఎత్తులో విమానం..మహిళకు పురుడు పోసిన ఎన్నారై డాక్టర్..!

Sunday, January 21st, 2018, 09:20:39 PM IST

అత్యవసర సమయంలో హేమల్ అనే ఎన్నారై డాక్టర్ విదేశీ మహిళకు పురుడు పోశాడు. విమానం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒగుండిపే అనే అమెరికాకు చెందిన మహిళ ఉన్నట్లుండి పురుటి నొప్పులతో బాధపడింది. వెంటనే స్పందించిన హేమల్ ఆమెకు విమానంలోనే పురుడు పోసి తల్లి బిడ్డలని క్షేమంగా రక్షించాడు.

ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హేమల్ ఢిల్లీ నుంచి అమెరికా బయలు దేరాడు. అతడు అమెరికాలోని క్లేవ్ ల్యాండ్ కు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుంచి పారిస్ చేరుకున్న తరువాత మరో విమానం ఎక్కాడు. 27 ఏళ్ల హేమల్ మూత్ర సంబంధ మరియు కిడ్నీ కి సంబందించిన డాక్టర్ గా అమెరికాలో పనిచేస్తున్నాడు. అంతకు ముందు రోజే జరిగిన తన బందువుల వివాహ కార్యక్రమంలో పాల్గొని బాగా అలసిపోయిన హేమల్ కాస్త మద్యం సేవించి ఇక పడుకోవాలని భావించాడట. అతడి పక్కనే ఒగుండిపే అనే 40 ఏళ్ల మహిళా కూర్చుని ఉంది. సడెన్ గా ఆమెకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. విమానం సిటీకి చేరుకోవాలనే ఇంకా నాలుగు గంటల సమయం పడుతుంది. దీనితో హేమల్ వేగంగా స్పందించిన ఆమెకు పురుడు పోశారు. ఒగుండిపే పండండి మగ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. ఆ సమయంలో నేను మద్యం సేవించకపోవడం దేవుడి లీలే అని హేమల్ తెలిపాడు. ఒక వేళ మద్యం సేవించి ఉంటె సరిగా వైద్యం చేసేవాడిని కాదేమో అని తెలిపాడు.