అశ్రద్ధను ఉపేక్షించేదిలేదు!

Monday, September 15th, 2014, 08:29:58 AM IST


తెలంగాణ ఉపముఖ్యమంత్రి టి రాజయ్య గాంధీ మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ సంబరాలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు రోగుల పట్ల శ్రద్ధను అధికం చేస్తూ, ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిగా పని చెయ్యాలని, అప్పుడే ప్రజలకు ఉత్తమ సేవలను అందించగలమని తెలిపారు. అలాగే లెక్క ప్రకారం ప్రభుత్వం వైద్యులు సాయంత్రం 4గంటల వరకు పని చెయ్యాలని, కానీ మధ్యాహ్నం 2గంటల తర్వాత వైద్యులు ఆసుపత్రుల్లో కనిపించడం లేదని రాజయ్య విమర్శించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవల కొరకు, ఉత్తమ సౌకర్యాల కొరకు, సిబ్బంది కొరకు విజ్ఞ్యప్తులు అందుతున్నాయని వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక ప్రభుత్వం ఈ సదుపాయాలను అన్నింటినీ ఏర్పాటు చేస్తుందని, అయితే డాక్టర్లు వృత్తిపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజయ్య వివరించారు. రోగుల పట్ల వైద్యులు అశ్రద్ద కనబరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి తెలిపారు. ఇక తాజాగా జరిగిన సర్వే ప్రకారం హైదరాబాద్ నగరంలో మరో ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉన్నట్లుగా తెలుస్తోంది.