ఆధార్ డేటా లీకేజీ పై ఆందోళన అవసరం లేదు : మాజీ చైర్మన్ నందన్ నీలేకని

Thursday, January 11th, 2018, 02:40:24 PM IST

బెంగుళూరు లో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమం లో విలేకరులతో మాట్లాడిన ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడిఎఐ) మాజీ చైర్మన్ నందన్ నీలేకని ఆధార్ డేటా గోప్యత సందేహం పై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఆధార్ డేటా లీకేజీ కి ఆస్కారమే లేదని, అదంతా ఒట్టి దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. ఆధార్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరో ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆధార్ గోప్యతకు సంబంధించి వచ్చిన కధనాల నేపధ్యం లో ట్రిబ్యూన్ పత్రిక పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం పై ఆయన స్పందించారు.

ఆధార్ డేటా ఉల్లంఘన పై యూఐడిఎఐ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ట్రిబ్యూన్ పై కేసు నమోదు చేశారని తెలిపారు. ఆధార్ పై ప్రతికూల భావాలతో ఉంటే ప్రతికూల స్పందనే వస్తుందని, ప్రజలు దీనిపై నిర్మాణాత్మక దృష్టితో వుండాలని ఆయన అన్నారు. ఆధార్ గోప్యత కోసం యూఐడిఎఐ ప్రవేశపెట్టిన నూతన వర్చువల్ ఐ డి విధానాన్ని ఆయన ఆహ్వానించారు. ప్రతి భారతీయ పౌరుడు ఎవరికి వారే యూఐడిఎఐ వెబ్ సైట్ ద్వారా ఒక వర్చువల్ ఐ డి ని సృష్టించుకోవచ్చని, ఆధార్ నెంబర్ అవసరం లేకుండా యూఐడిఎఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.