ఎలక్షన్ 2019: పవన్ చిత్తశుద్ధి ఇదేనా…?

Thursday, March 21st, 2019, 09:27:14 AM IST

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి అంబరాన్నంటుతోంది. పార్టీలన్నీ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయటంతో ప్రచారం కూడా ఊపందుకుంది, ఈ క్రమంలో సీటు దక్కని వారంతా పార్టీ అధిష్టానంపై అసమ్మతి స్వరం కూడా మొదలెట్టారు. ఇదిలా ఉండగా, సీట్ల కేటాయింపులో వర్గాల వారీగా లెక్కలేస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీఎం శ్రేణులు జనసేనపై ప్రధానంగా సంధిస్తున్న ఆరోపణ సీట్ల సర్దుబాటు సందర్భంగా చంద్రబాబునాయుడుతో రహస్య ఒప్పందం జరిగిందని.అన్నీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోరాటం చేస్తామని ఎన్నోమార్లు చెప్పారు. తీరా నామినేషన్లు ప్రక్రియ ఊపందుకున్న తర్వాత సీట్ల సర్దుబాటును చూస్తుంటే పవన్ చంద్రబాబుల రహస్య స్నేహం అర్థమౌతోందని అంటున్నారు.

జనసేన విడుదల చేసిన అభ్యర్థుల జాబితా చూస్తోంటే చంద్రబాబు, పవన్ మధ్య సంబంధాలపై వైసీపీపై చేస్తున్న ఆరోపణలు నిజమేమో అనుమానం బలపడుతుంది. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన అభ్యర్ధి ఉంటే లోకేష్ కు ఇబ్బందులని ఆ సీటును సిపిఐకి కేటాయించారు. విజయవాడ సెంట్రల్ లో కూడా బోండా ఉమకు పోటీగా సిపిఎం కు సీటు కేటాయించారు. దీంతో పాటుగా టీడీపీ కూడా విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో జేడి లక్ష్మీనారాయణ, గాజువాకలో పవన్ పోటీ చేస్తున్నారని, పెందుర్తి నియోజకవర్గాన్ని చాలా రోజులు రిజర్వులో ఉంచారు. ఇక్కడ టిడిపి తరపున ఐదుసార్లు గెలిచిన బండారు సత్యనారాయణమూర్తికి మంగళవారం తెల్లవారి జామున టికెట్ ప్రకటించిన పరిస్థితి. దళితుల ఓట్లన్నీ ఎక్కడ వైసీపీకి పడిపోతాయో అన్న భయంతో చంద్రబాబే బీఎస్పీ, జనసేనల మధ్య పొత్తు కుదిర్చారని అంటున్నారు, నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు కేటాయించే సీటులో మార్పులు చేసారు. ఇదంతా గమనిస్తే జనసేన టీడీపీల మధ్య రహస్య ఒప్పందం ఉన్నమాట వాస్తవమే అనిపిస్తోంది.