తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికుల ప్రాణాలు రక్షించిన డ్రైవర్!

Friday, January 19th, 2018, 10:52:09 AM IST

మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, మానవ సంబంధాలు పూర్తిగా ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఇతివువంటి కాలం లో కూడా మానవత్వం ఇంకా నిలిచే వుంది అన్నదానికి నిలువెత్తు సాక్ష్యం ఇది, తన ప్రాణం పోతున్నా సరే సాటి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాలని ఒక డ్రైవర్ వ్యవహరించిన తీరు తెలిస్తే ఎవరికైనా సరే గుండె చలించిపోతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కంఠేశ్వర్, 43 మంది ప్రయాణీకులతో ధర్మవరానికి బయల్దేరారు. బస్సు కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామం దాటాక కంఠేశ్వర్ గుండెల్లో వున్నట్లుండి తీవ్ర నొప్పి మొదలయింది. దాని కారణంగా శరీరం వణుకుతూ, కాళ్ళు చేతులు అదుపు తప్పాయి. పరిస్థితి తనకు పూర్తిగా అర్ధమయినప్పటికీ ప్రయాణీకులకు చెప్పలేని నిస్సహాయత తో నొప్పిని భరిస్తూనే ఒకచేత్తో గుండెను అదిమిపట్టుకుని, మరొక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మెల్లగా బస్సు వేగం తగ్గించి చివరకు బస్సును రోడ్ ప్రక్కన ఆపి స్పృహ కోల్పోయి స్టీరింగ్ మీద కూల పడ్డారు. ఆయన స్థితిని గమనించిన ప్రయాణీకులు తక్షణం 108 కు ఫోన్ చేసి అంబులెన్సులో ఆయన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెపుతున్నారు. భరించలేని గుండెనొప్పి వేధిస్తున్న సాటి ప్రయాణీకుల ప్రాణాలు కూడా తన ప్రాణాల వంటివే అని గ్రహించి మానవత్వం తో వ్యవహరించిన కంఠేశ్వర్ ను పలువురు ప్రశంసిస్తున్నారు…