డీఎస్ అన్నంత‌ప‌ని చేస్తున్నాడా?

Saturday, November 10th, 2018, 12:01:55 AM IST

గ‌త కొంత కాలంగా తెరాస‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న డీ. శ్రీ‌నివాస్ త్వ‌ర‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడ‌ని గ‌త ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌చారాన్ని ఎప్ప‌టి క‌ప్పుడు క‌ప్పిపుచ్చుకుంటూ చేయాల్సిన ప‌నులు చేస్తూ వ‌స్తున్న డీఎస్ ఈ సారి ఏకంగా సోనియాను క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నిజం చేసి త‌ను అనుకున్న ప‌నికి డీఎస్ సిద్ధ‌మ‌వున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో గ‌త కొంత కాలంగా తెరాస ఎంపీ, కేసీఆర్ కూతురు క‌వితకు వ్య‌వ‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆగ్ర‌హించిన కేసీఆర్ పార్టీకి డీఎస్‌ను దూరంగా పెడుతూ వ‌స్తున్నారు.

దీంతో నిజామాబాద్‌కు చెందిన తెరాస నేత‌లంతా డీఎస్‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. అప్ప‌టి నుంచి గులాబీ ద‌ళ‌ప‌తిని డీఎస్ క‌ల‌వాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. కావాల‌నే డీఎస్‌కు కేసీఆర్ అపాయింగ్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని కూడా పార్టీ శ్రేణుల్లో ప్ర‌చారం జ‌రిగింది. దాంతో విసుగుపుట్టిన డీఎస్ గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ అదినాయ‌క‌త్వాన్ని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే ఈ మ‌ధ్య చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంలో డీఎస్ కూడా ఢిల్లీ వెళ్లి రాహుల్‌ని క‌లిశాడు. కానీ ఫ‌లితం శూన్యం.

ఇక సోనియా గాంధీని ప్ర‌స‌న్నం చేసుకుంటే త‌ప్ప తిరిగి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ దొర‌క‌ద‌ని భావించిన డీఎస్ శుక్ర‌వారం ఢిల్లీలో సోనియాను క‌లిసి తెలంగాణ ఎన్నిక‌ల వేళ జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింది. గ‌తంలో రాహుల్‌ని క‌ల‌వ‌డానికి చంద్ర‌బాబు ఢిల్లీ వ‌చ్చిన వేళ డీఎస్ కూడా చంద్ర‌బాబును క‌ల‌వ‌డం కూట‌మి వెన‌క డీఎస్ హ‌స్తం కూడా వుంద‌నే కొత్త అనుమానాలకు తావిస్తోంది.