తేరాస ఎమ్మెల్యే 900కోట్ల అక్ర‌మార్జ‌న‌?

Saturday, September 29th, 2018, 11:00:43 PM IST

రేవంత్ రెడ్డి అక్ర‌మార్జ‌న 1000 కోట్లు అంటూ ఇటీవ‌ల ఐటీ దాడుల నేప‌థ్యంలో మీడియా ప్ర‌చారం సాగించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. ఇప్పుడు అదే తరహాలో తేరాస‌ ఎమ్మెల్యే పుట్ట మ‌ధు ఆస్తుల చిట్టా ఒక‌టి బ‌య‌ట‌ప‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. పుట్టా ఏకంగా 900 కోట్లు అక్రమంగా సంపాదించార‌ని, అత‌డిపై ఐటి, సీబీఐ, ఈడి అధికారులకు ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. జూబ్లిహిల్స్‌లో దివంగ‌త సినీ నటుడు శ్రీహరి ఇంటి పక్కనే మ‌ధు 5 కోట్ల విలువ చేసే ఇల్లు కొన్నార‌ని, తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లు వసూలు చేశార‌ని పిటిష‌నర్‌ ఐటీకి వివ‌రాలందించారు.

స‌ద‌రు పిటిష‌న‌ర్ అందించిన ఆస్తుల చిట్టా ప‌రిశీలిస్తే షాక్‌కి గుర‌వ్వాల్సిందే. యుఏఈ -దుబాయ్ లో హోటల్స్ నిర్మాణ రంగంలో 100 కోట్ల పెట్టుబడులు పెట్టిన మ‌ధు, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో త‌న‌ క్లాస్‌మేట్‌ శ్రీనివాస్ బినామీ పేరుతో భువన సురయి డెవ‌ల‌ప‌ర్స్ లో 100 కోట్ల మేర‌ పెట్టుబడులు పెట్టార‌ని పేర్కొన్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీ పేరుతో భారీగా ఆర్జిస్తున్నార‌ని, సోదరుడు పుట్ట సత్యనారాయణ పేరుపై 50 కోట్ల టర్నోవర్ మేర‌కు బిజినెస్‌లు ర‌న్ అవుతున్నాయ‌ని చిట్టాలో పేర్కొన్నారు.

తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్ ఇరు రాష్ట్రాల్లో భవితశ్రీ చిట్ ఫండ్స్ పేరుతో 20 బ్రాంచీల్లో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టార‌ట‌. మంథాని మండలం విలోచవరం లో 60 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి, మహారాష్ట్ర నాగ్ పూర్ లో 40 ఎక్కరాల ల్యాండ్ (అందులో 40 కోట్లతో మెడికల్ కాలేజి), ముంబైలోని ఆది రాజ్ కన్‌స్ట్ర‌క్షన్స్ పేరుతో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టార‌ని జాబితాలో పేర్కొన్నారు. కాటారం మండలం ఒడిపిల‌వంచ‌ లో 2 కోట్లు విలువ చేసే 50 ఎకరాల వ్యవసాయ భూమిని, పలివెల మండలం మహాదేవపూర్ లో నాలుగు కోట్లు విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయ‌న సొంతం చేసుకున్నార‌ని పిటిష‌నర్ మ‌ధు అక్ర‌మార్జ‌న‌ చిట్టాను ఈడీకి అందించార‌ట‌.