టెన్ష‌న్‌: ఎల‌క్ష‌న్ తేదీపై క‌మీష‌న్ బాంబ్‌!?

Wednesday, September 19th, 2018, 03:58:28 PM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కు రాజుకుపోతున్న వేళ ఆ టెన్ష‌న్‌ని పెంచేస్తూ ఇంకా ఎల‌క్ష‌న్ తేదీల్ని ప్ర‌క‌టించ‌కుండా స‌స్పెన్స్‌లోనే ఉంచ‌డం వాడివేడిగా చ‌ర్చ‌కొచ్చింది. నేడో రేపో కేంద్ర‌, రాష్ట్ర‌ ఎన్నిక‌ల క‌మీష‌న్ల‌ నుంచి ఆ ప్ర‌క‌ట‌న కాస్తా వ‌చ్చేస్తుంద‌ని రాజ‌కీయ పార్టీల‌న్నీ హైరానా ప‌డిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మీడియాతో ముచ్చ‌టిస్తూ.. ఎన్నికల నిర్వహణపై ఇంకా తేదీలు ఖరారు చేయ‌లేద‌ని, దీనిపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఈ విషయం పై రాష్ట్రాల్ని సంప్రదించాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌రమైన ఏర్పాట్లు పూర్త‌యితే ఆటోమేటిక్ గా కేంద్ర ఎన్నికల కమిషన్ తగిన విధంగా నిర్ణయం తీసుకుటుంద‌ని క్లూ ఇచ్చారు. అంటే దీన‌ర్థం ఏదో ఒక స‌మ‌యాన ఆక‌శ్మికంగా ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డే ఛాన్సుంద‌ని ఆయ‌న పరోక్షంగా నివేదించిన‌ట్ట‌య్యింది. ఇక ఎన్నిక‌ల వేళ పార్టీల‌కు ర‌జ‌త్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఫలానా అభ్యర్థి కి ఓటు వేయాలని జరుగుతున్న తీర్మానాలు, ప్రతిజ్ఞలపై ఇప్పటికి వరకు ఎలాంటి పిర్యాదులు అందలేదు. బలవంతంగా తీర్మానాలు, ప్రతిజ్ఞ లు చేయిస్తున్నట్టు మా దృష్టి కి వస్తే చట్టపరంగా క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామ‌ని ర‌జ‌త్ హెచ్చరించారు. ఓటు ఎవ‌రికి వేయాలో అది ఓట‌రు వ్యక్తిగత విషయం. బలవంతంగా ప్రతిజ్ఞ చేయిస్తే తాట తీస్తామ‌ని అన్నారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ముచ్చ‌టిస్తూ .. ప్ర‌స్తుతం ఓటర్ నమోదు పక్రియ వేగంగా జరుగుతోంది. ప్రతి రోజు ఎన్నికల అవగాహనపై క‌లెక్ట‌ర్ల‌తో సమీక్షిస్తున్నాం. రెండు రోజుల ఓటర్ నమోదు పై స్పెషల్ డ్రైవ్ పూర్త‌యింది. సాంకేతిక పరిజ్ఞానం పై శిక్షణ ఇవ్వాల్సి ఉంద‌ని అన్నారు. పోలింగ్ బూత్‌ల వ‌ద్ద‌ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. కొత్తగా ప్రవేశపెడుతున్న వివి ఫ్యాట్ లపై చాలా మంది అధికారులకు అవగాహన లేదు. అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.