కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు

Wednesday, September 26th, 2018, 12:01:28 AM IST

నోటి దుర‌ద ఫ‌లిత‌మిది! ఆవేశ‌ప‌డి అనర్థం కొనితెచ్చుకుంటే దాని ఫ‌లితం ఎంత దారుణంగా ఉంటుందో చూడ‌బోతున్నారు న‌ల్గొండ ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. పీసీసీపైనా, ఏఐసీసీ తెలంగాణ‌ ఇన్‌ఛార్జ్ కుంతియాపైనా తీవ్ర దుష‌ణ‌ల‌తో నోరు జారిన ఫ‌లితం అనుభవించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అత‌డికి కాంగ్రెస్ పార్టీ రాంరాం ప‌ల‌క‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే అత‌డిపై క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం అభియోగం న‌మోదైంది. దీనిపై కాంగ్రెస్ పాల‌క వ‌ర్గ‌ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ విచార‌ణ సాగిస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు తూల‌నాడిన దానికి స‌మాధానం ఇచ్చుకోవాల్సిందిగా ఇప్ప‌టికే రాజ‌గోపాల్‌ని కాంగ్రెస్ అధిష్ఠానం కోరింది. దానికి మూడు పేజీల వివ‌ర‌ణ ఇచ్చారు స‌ద‌రు ఎమ్మెల్సీ. కానీ అత‌డి స‌మాధానాల‌కు అధిష్ఠానం సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది.

రాజ‌గోపాల్ రెడ్డి రాజ‌కీయ జీవితం లోతుపాతుల్ని సీరియ‌స్‌గా వెలికి తీస్తున్నారు క‌మిటీ స‌భ్యులు. అస‌లు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఏ సంబంధం లేనివాడు. 2009 ఎల‌క్ష‌న్స్ వ‌రకూ అస‌లు కాంగ్రెస్‌తో ఏ ర‌కంగానూ సంబంధం లేని వ్య‌క్తి. పార్టీకి అత‌డు తొలి నుంచి జెండా మోసిన కార్య‌క‌ర్త కానేకాదు. ఏదో అన్న కోమిటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భిక్ష‌తో అత‌డు రాజ‌కీయ నాయ‌కుడు అయ్యాడు. యూత్ కాంగ్రెస్‌కి కానీ, లేదా పీసీసీకి కానీ ఆయ‌న ప‌ని చేసిందేం లేదు. ఏదో అన్న అండ‌దండ‌లతో నేరుగా ఎంపీ అయిపోయాడు. 2014లో భువ‌న‌గిరి ఎంపీ సీటును కోల్పోయాడు. ఆ క్ర‌మంలోనే పార్టీ ఎంఎల్‌సీ క‌ట్ట‌బెట్టింది. ఇంత‌టి హీన‌చ‌రిత్ర ఉన్న ఆయ‌న కాంగ్రెస్‌లో సీనియ‌ర్ల‌ను, ఇన్‌ఛార్జుల్ని తిట్టేసేంత ఎదిగేశాడా? అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వ‌చ్చే మంగ‌ళ‌వారం లోపుచేసిన త‌ప్పిదంపై స‌రైన వివ‌ర‌ణ ఇచ్చుకోక‌పోతే క్ర‌మ‌శిక్ష‌ణ విభాగం తీవ్ర‌మైన చ‌ర్య‌లే తీసుకోనుంది. టీపీసీసీ కొత్త‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న‌మ్ ప్ర‌భాక‌ర్ సైతం రాజ‌గోప‌ల్ రెడ్డి `బ్రోక‌ర్స్‌`, జోక‌ర్స్ అంటూ తిట్టేసేంత ఎదిగేశాడా? అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. త‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా క‌మిటీ ప‌క్క‌న పెట్టేస్తే అటుపై రాజ‌గోపాల్ రెడ్డి నేరుగా యువ‌రాజా రాహుల్ గాంధీనే క‌లిసేందుకు ముందుగానే ప్రిపేర‌వుతున్నార‌ట‌.