వేదాలు, పురాణాలు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా చదవాల్సిందే!

Friday, January 26th, 2018, 04:05:03 PM IST


కొన్ని వేలమంది ఇంజనీరింగ్ విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం పట్టాలు పొంది బయటకి వస్తున్న వైనం చూస్తున్నాము. కేవలం మన రెండు రాష్ట్రాల్లో నే కాదు మొత్తం దేశ వ్యాప్తం గా చూస్తే ఆ సంఖ్య లక్షల్లో వుంది. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక పై సాంకేతిక విద్య మాత్రమే కాదు వేదాలు, పురాణాలు, తర్క, యోగ శాస్త్రాలను అధ్యయనం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికెల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఈ) ఈ మేరకు కొత్త పాఠ్యాంశ ప్రణాళిక విడుదల చేసింది. ఇప్పటివరకు రాజ్యాంగం, పర్యావరణ సైన్సు కు సంబందించిన అంశాలు వారికి బోధిస్తున్నా, వాటికి వచ్చే మార్కులను పరిగణలోకి తీసుకోరు అనే విషయం అందరికి తెలిసిందే. భారతీయ తాత్విక భాష, కళాత్మక సంప్రదాయాలు, యోగ , ఆధునిక శాస్త్రీయ దృక్పధం పై అవగాహన పెంపొందించేందుకు పాఠ్య ప్రణాళికను పునరుద్దరించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలియచేసారు. ఆలోచన విధానం, తర్కం, వేదాల్లోని ప్రాధమిక సూత్రాలను విద్యార్థులకు అందచేయడమే ఆ పాఠ్యాంశాలను పొందుపరిచే లక్ష్యమన్నారు. దేశం లోని దాదాపు మూడు వేల కళాశాలల నుండి దాదాపు ఏడు లక్షలమంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకి వస్తున్నా దానిలో సగం కంటే తక్కువ మందికే ఉపాధి దొరుకుతోందనేది ఒప్పుకోవాల్సిన నిజం అని పరిశీలకులు అంటున్నారు. ఇంజినీర్లు అయిన విద్యార్థుల్లో అధికులు నిరుద్యోగులుగా మిగులుతున్నారని, ఇంజనీరింగ్ విద్య నాణ్యత ప్రమాణాల్లో లోపం వ్యక్తమవుతుందనేది ఒప్పుకోవాల్సిన విషయమని అంటున్నారు. వారికి సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టాలని ఒక వాదన నడుస్తుంటే, కాదు వారికి వేదం, పురాణాల్లో జ్ఞానం పెంపొందించడానికి సరికొత్త సిలబస్ ప్రవేశపెట్టడం సరైనదై కాదని మరికొందరి వాదన. అయితే నాణ్యత ప్రమాణాల పై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం వేదాలు వాల్లించండి అని విద్యార్థుల పై రుద్దడం ఎంతవరకు సబబని వామపక్షాల విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ….