శ‌త్రువులు క‌లిశారు.. ప్ర‌త్య‌ర్థికి చుక్క‌లే

Sunday, November 18th, 2018, 03:24:03 PM IST

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు అంటూ వుండ‌రు! ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. అదే స‌త్యాన్ని మ‌ళ్లీ నిజం చేశారు దానం నాగేంద‌ర్‌, విజ‌యారెడ్డి. గ‌తంలో దానం కాంగ్రెస్‌లో వుండ‌గా ఖైర‌తాబాద్ నియోజ‌క వ‌ర్గం కోసం దానం నాగేంద‌ర్‌, పీజేఆర్ కూతురు విజ‌యారెడ్డి పోటీప‌డి బ‌ద్ద శ‌త్రువుల‌య్యారు. ఇప్ప‌డు సీను మారింది. కాంగ్రెస్‌ను వీడి దానం తెరాస‌లో చేర‌డంతో ఖైర‌తాబాద్‌లో స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయాయి. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున దానం నాగేంద‌ర్‌, వైఎస్సార్ సీపీ త‌రుపున విజ‌యారెడ్డి పోటీప‌డ్డారు.

హోరాహోరీగా జ‌రిగిన పోటీలో విజ‌యారెడ్డిపై దానం నాగేంద‌ర్ గెలుపొందాడు. ఆ త‌రువాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల కార‌ణంగా విజ‌యారెడ్డి వైఎస్సార్ సీపీని వీడి తెరాస గూటికి చేరారు. ఆ త‌రువాత ఖైర‌తాబాద్ నుంచి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. అయితే ఇటీవ‌ల త‌న‌కు రాజ‌కీయ శ‌త్రువుగా మారిన దానం నాగేంద‌ర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. దీంతో శ‌త్రువులుగా వున్న వీరిద్ద‌రూ మిత్రుల‌య్యారు. దీంతో ఖైర‌తాబాద్ టికెట్ సొంతం చేసుకున్న దానం నాగేంద‌ర్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోర‌డం, గ‌తాన్ని ప‌క్క‌న పెట్టి దానం గెలుపుకు అండ‌గా నిలుస్తాన‌ని మాటివ్వ‌డం తెరాస వ‌ర్గాల్లో ఆనందాన్ని క‌లిగిస్తోంది.