వామ్మో.. విశాఖలో రేట్లు మండుతున్నాయ్..!

Monday, October 13th, 2014, 09:30:25 PM IST

hudood
హుదూద్ తుపాను ఎఫెక్ట్ తో విశాఖపట్టణం విలవిలలాడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు..’ స్థానిక వ్యాపారులు సామాన్యులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెట్రోల్ బంకులు, కిరాణా, కూరగాయల దుకాణాలు, పాల బూత్ ల వద్ద జనాలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా రిటైల్ వ్యాపారులు నిత్యావసరాలు ధరలను అమాంతం పెంచేశారు. డిమాండ్ ను మరింత పెంచడానికి బ్లాక్ మార్కెటింగ్ కు కూడా పాల్పడుతున్నారు. దీంతో, విశాఖలో కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు మొదలైనవాటి ధరలు చుక్కలను తాకుతున్నాయి.

లీటర్ పాలు రూ. 80
లీటర్ పాల ధర 80 రూపాయలకు చేరుకుంది. తుపానుకు ముందు ఉల్లి ధర కిలో 20 ఉండగా, ప్రస్తుతం 50కి పెంచేశారు. చాలా నిత్యావసరాల ధరలు మూడింతలు పెరిగిపోయాయి. స్థానిక వ్యాపారులే తమకు చుక్కలు చూపెడుతుండడంతో విశాఖ వాసులు లబోదిబోమంటున్నారు.

లీటర్ పెట్రోల్ రూ. 100
ఇక అక్కడ పెట్రోల్ ధర కూడా భగ్గుమంటోంది. లీటర్ పెట్రోలు 100 రూపాయలు పలుకుతోంది. మంచి నీరుకూడా ఉత్పత్తి చేసే వెసులుబాటు లేకపోవడంతో నీటి ధరకు కూడా రెక్కలొచ్చాయి. ఇంత తీవ్రతను ఊహించని ప్రజలు ఒకట్రెండు రోజులకు సరిపడా సరకులు నిల్వచేసుకోవడంతో నిత్యావసర వస్తువులు నిండుకున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రోజులు ఎలా వెళ్లదీయాలా అని విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.