అటువంటివారికి డిపాజిట్లు కూడా రావు : చంద్రబాబు

Tuesday, March 20th, 2018, 02:39:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్రం లో టీడీపీ ప్రభుత్వం పై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షాలు తమ పార్టీ పై ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. హోదా విషయమై ప్రధాన ప్రతిపక్షం, అలానే ఇతర పక్షాలు లబ్ది పొందాలని చూస్తున్నాయి అన్నారు. అటువంటి లాలూచీ రాజకీయాలతో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారెవరికీ వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఆయన హెచ్చరించారు. బిజెపి లోక్‌సభలో ఒక పార్టీతో అవిశ్వాసం పెట్టించి, మరో పార్టీతో గొడవ చేయించి సభ వాయిదా వేసుకుని పోవాలని చూస్తోందని, లాలూచీ రాజకీయాలకు ఇది పరాకాష్టని ధ్వజమెత్తారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని తెలిపారు. మన హక్కుల కోసం ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇది కీలక సమయం. అందరూ అప్రమత్తంగా ఉండాలి. మనం అడుగుతోంది న్యాయం చేయమనే కదా. న్యాయం కోరితే యుద్ధం చేస్తారా, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్లీనరీలో చెప్పింది. అలాంటప్పుడు కేంద్రానికి అభ్యంతరమేమిటి అని సీఎం ప్రశ్నించారు. కేసుల మాఫీకి జగన్‌ అప్పుడు కాంగ్రెస్‌తో, ఇప్పుడు బిజెపితో లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు.

అప్పట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలోనూ లోక్‌సభలో టిడిపి ఎంపీల మాటున జగన్‌ దాక్కున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని, వారికీ అంతా తెలుసునన్నారు. కాగా సోమవారం సభలో చోటు చేసుకున్న పరిణామాల్ని ముఖ్యమంత్రికి ఎంపీలు వివరించారు. టీఎంసీ, ఎన్సీపీ, ఆప్‌, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రదర్శించాయని పార్టీ ఎంపీలు చంద్రబాబుకు తెలిపారు. టిడిపి వెల్‌లోకి వెళ్లి అడ్డుకుందని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, దానిలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. లోక్‌సభ వెల్‌లో ఎవరున్నారో ఒక రాజ్యసభ సభ్యుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల్లో అపోహలు రేకెత్తించేందుకే వైసిపి ఒక వ్యూహం ప్రకారం తమపై దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు…..