సఫారీలని సాగనంపిన బుమ్రా..ఈ సారైనా నమ్ముకోవచ్చా..!

Thursday, January 25th, 2018, 09:09:17 PM IST

టీం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో భారత జట్టు లీడ్ లోకి వచ్చింది. ఈ ఆధిక్యాన్ని మూడవరోజు ఆటలో బ్యాట్స్ మాన్ ఎంతవరకు తీసుకుని వెళతారనేదానిపైనే భారత జట్టు విజయావకాశాలు అధారపడి ఉంటాయి. తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 187 పరుగులకే కుప్ప కూలిన సంగతి తెలిసిందే. భారత యువ ఫేసర్ బుమ్రా ధాటికి సఫారీలు కూడా అదే బాట పట్టారు. సౌత్ ఆఫ్రికా జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయి సింగిల్ డిజిట్ ఆధిక్యం సాధించింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా కెరీర్ లో తొలిసారి 5 వికెట్లు సాధించాడు.

భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా, షమీ మరియు ఇషాంత్ లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. పార్థివ్ పటేల్ రూపంలో ఆదిలోనే ఇండియా తొలి వికెట్ ని కోల్పోయింది. రెండవరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టపోయి 49 పరుగులు సాధించింది. ప్రస్తుతం టీం ఇండియా 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడవరోజు ఆట కీలకం కానుంది. మూడవరోజు భారత బ్యాట్స్ మాన్ ఎన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే అంత పటిష్ట స్థితిలో నిలిచినట్లు. సౌత్ ఆఫ్రికా టూర్ లో టీం ఇండియా బ్యాట్స్ మాన్ రాణించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మూడవరోజు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది.