మొత్తానికి పొట్టిఫార్ములా భలేమజా ఇచ్చింది..!

Monday, April 4th, 2016, 11:11:00 AM IST


పొట్టి ఫార్మాట్ అదరగొట్టింది. టెస్ట్, వన్డే ఆడుతున్న తరుణంలో సరదాగా సాయంత్రంవేళ క్రీడాభిమానులను అలరించేందుకు టి 20 క్రికెట్ ను ప్రవేశపెట్టారు. మొదట కౌంటీలలో సక్సెస్ అయిన ఈ ఫార్ములా.. తరువాత ఇండియాకు పాకింది. ఐపీఎల్ మొదలుపెట్టాక.. ఇక టి20 మ్యాచ్ లకు ప్రాధాన్యత పెరిగింది. ఆద్యంతం మ్యాచ్ లు ఆసక్తిగా ఉండటంతో.. ఐపీఎల్ సక్సెస్ అయింది. ఆ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అదే ఫార్మాట్ ను అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశపెట్టింది. 2007లో మొదటిసారి టి20 వరల్డ్ కప్ ను నిర్వహించారు. మొదటి ప్రపంచ కప్ ను ఇండియా గెలుచుకున్నది. అప్పట్లో దానా ధన్ ధోని అద్బుతమైన ప్రదర్శనతో వరల్డ్ కప్ ను గెలిపించాడు.

ఆ తరువత టి20 వరల్డ్ కప్ ఇండియాను ఊరిస్తూ వచ్చింది. అయితే, గత కొంతకాలంగా టి20 మ్యాచ్ ర్యాంకింగ్ లో ఇండియా జట్టు నెంబర్ 1 గా ఉన్నది. టి 20 వరల్డ్ కప్ కు ముందు ఇండియా ఆసియా కప్ ను సొంతం చేసుకున్నది. దీంతో ఇండియాలో జరుగుతున్న టి 20 వరల్డ్ కప్ పై సగటు అభిమాని ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇండియా ఆరంభమ్యాచ్ తప్పించి ప్రతి మ్యాచ్ లో కూడా అంచనాలకు తగిన విధంగా ఆడింది.

పాక్ మ్యాచ్ లో ఇండియా ఆటతీరు ఆధ్యటం ఆకట్టుకున్నది అనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ పై ఇండియా టీం తన రికార్డ్ ను మరోసారి నిలుపుకున్నది. వన్డే వరల్డ్ కప్ లో 6 సార్లు.. టి20 వరల్డ్ కప్ లో ఐదు సార్లు ఇండియా పాక్ పై విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు వరల్డ్ కప్ లో పాక్ మనల్ని ఓడించిన దాఖలాలు లేవు. ఈ రికార్డ్ ను భవిష్యత్తులో కూడా టీం ఇండియా కొనసాగిస్తుందని ఆశిద్దాం.

ఇకపోతే, ఈ టి 20 వరల్డ్ కప్ లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సగటు క్రికెట్ అభిమానులను అలరించింది. చివరి వరకు ఇండియా ఓటమి ఖాయం అనుకున్నా.. ఇండియా టీం మాత్రం ఓటమిని అంగీకరించలేదు. పోరాడితే గెలుస్తాం అనే రీతిగా ఆడారు. పాండ్యా వేసిన చివరి మూడు బంతుల్లోనే 9 పరుగులు వచ్చాయి. విజయానికి మూడు పరుగులు అవసరం.. మూడు బంతులు ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్ చేసిన చిన్న తప్పులకు మూడు బంతులలో కేవలం ఒక్క పరుగు మాత్రమె వచ్చింది.. పైగా మూడు వికెట్లు కోల్పోయింది.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి వీరోచిత పోరాటం అందరికి గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి ఆడిన ఆటతీరు అద్బుతం. కేవలం కోహ్లి ఆడటం వలనే ఇండియాకు గెలుపు సాధ్యమయింది. సచిన్ తరువాత అటువంటి ఆటగాడు ఎవరు దొరుకుతారు అనుకున్న సమయంలో టీం ఇండియాకు కోహ్లి దొరికాడు. అయితే, సెమిస్ లో ఇండియా చిన్న చిన్న అనవసర తప్పిదాలు చేయడం వలన వెస్ట్ ఇండీస్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది. ఓటమికి బాధ్యులు ఎవరు అనే విషయం గురించి ఆలోచించడం కంటే.. ఇండియా ఆడిన ఆటతీరును విశ్లేషించుకోవడం మంచింది. ఇండియాను ఓడించింది కేవలం నో బాల్స్ మాత్రమే. అన్ని మ్యాచ్ లలో మంచి ప్రతిభను కనబరిచిన బౌలర్లు సెమిస్ కు వచ్చే సరికి ఎందుకు అలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో, నో బాల్స్ ఎందుకు వేశారో అర్ధంకాని ప్రశ్న. ఏదైతేనేం.. ఇండియా టీం ఈ వరల్డ్ కప్ లో అద్బుతమైన ఆటతీరును ప్రదర్శించింది. నెంబర్ 1 టీం అనిపించుకునే విధంగా ఆడింది అనిమాత్రం చెప్పొచ్చు.