తిత్లి తుఫాన్ భారీ నష్టం ఇలా పూడ్చొచ్చు..జేడీ లక్ష్మి నారాయణ అద్భుత విశ్లేషణ!

Wednesday, October 17th, 2018, 02:17:48 PM IST

గత కొన్ని రోజుల క్రితం హుదూద్ తరహాలో వచ్చినటువంటి మరో భారీ తిత్లి తుఫాను శ్రీకాకుళం జిల్లా అంతటిని కుదిపేసింది.శ్రీకాకుళం వాసులు వారి జీవితంలో మళ్ళీ మర్చిపోలేనంత నష్టాన్ని మరియు విషాదాన్ని మిగిల్చింది.ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ అధికారులు అక్కడి పరిస్థితిని చక్క దిద్దడానికి శత విధాలా వారి వంతు కృషి చేస్తున్నారు.అంతే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా ఎంతో మంది నటులు విరాళాలను అందించారు.ఇప్పుడు తాజాగా మాజీ సిబిఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ అక్కడికి చేరుకొని పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

ఈ తుఫాను వల్ల ఇప్పటికే శ్రీకాకుళం భారీ నష్టాన్ని చవి చూసిందని,ఇక మీదట ఇక్కడ ఏం పనులు చేపడితే ఇక్కడి పరిస్థితులు త్వరగా చక్కబడతాయో అన్న విషయం పై ఆయన చక్కని విశ్లేషణను అందిస్తున్నారు.గత రెండు రోజులు నుంచి తాను ఇక్కడే ఉండి ఈ ప్రాంతం అంతటిని పరిశీలిస్తున్నానని తెలిపారు.ఈ శ్రీకాకుళం ప్రాంతం అంతా దాదాపు 90 శాతం వరకు కొబ్బరి పంట మీదనే ఆధారపడి ఉండే ప్రాంతమని కానీ ఇప్పుడు ఈ పంటకే అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

అందుకు గాను ఇప్పుడు దెబ్బ తిన్న చెట్లకు ఎలాంటి వ్యాధులు సోకకుండా తగిన మందులను వాడాలని తెలిపారు,ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ కొబ్బరి పంట వేస్తే అది పూర్తి స్థాయిలో ఎదగడానికి ఇంకా 8 ఏళ్ళు పడుతుందని అందుకని త్వరగా ఎదిగే అరటి తోటలను మరియు చాక్లెట్ పరిశ్రమలకు విపరీతమైన డిమాండ్ ఉండే కోకో పంటను వేస్తే ఆర్ధికంగా కూడా శ్రీకాకుళం త్వరగా కోలుకుంటుందని తెలిపారు.కూలిపోయిన కొబ్బరి చెట్ల యొక్క బోండాలను మరియు చీపురుపుల్లను ప్రభుత్వం వారు అధిక ధరను ఇచ్చి కొనుక్కుంటే మంచిదని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments