చంద్ర‌బాబు నిజంగానే ఐకాన్.. వైసీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచ‌ల‌నం..!

Thursday, November 1st, 2018, 04:23:27 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగితే.. క‌నీస మాన‌వ‌త్వం లేకుండా జ‌గ‌న్ పై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేయ‌డం చాలా దారుణ‌మ‌ని అవినాష్ రెడ్డి అన్నారు. 40 ఏళ్ళ రాజ‌కీయ అని డబ్బా కొట్టుకునే చంద్ర‌బాబు నిజంగానే ఐకాన్ అని.. ఎందులో అంటే అవినీతిలో ఐకాన్‌గా మారార‌ని.. అవినాష్ రెడ్డి మండి ప‌డ్డారు. త‌న కుట్ర‌లో భాగంగా తునిలో రైలును తగులబెట్టించి.. ఆ నెపాన్ని కడప జిల్లా ప్రజలపై మోపిన చంద్ర‌బాబుకు.. ఇప్పుడు అదే జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేద‌ని అవినాష్ అన్నారు.

అంతే కాకుండా రాజ‌ధాని ప్రాంతంలో భూముల‌న్నీ దోచుకొని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తూ ఇప్పుడు ధ‌ర్మ పోరాట దీక్ష‌లంటూ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి డ్రామాలు ఆడుతున్నార‌ని అవినాష్ రెడ్డి తెలిపారు. వ‌ర్షాలు లేక‌ కడప జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం పంటలన్ని ఎండిపోయాయ‌ని.. అయితే రైతుల గురించి గానీ, క‌రువు గురించి గానీ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో చంద్ర‌బాబు ఒక్క‌మాట కూడా ఎందుకు మాట్లాడ‌లేద‌ని అవినాష్ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి.. చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌కి త‌డిసిపోతుంద‌ని.. దీంతో ఆప‌రేషన్ గ‌రుడ అంటూ కుట్ర‌కు తెర లేపార‌ని అవినాష్ ద్వ‌జ‌మెత్తారు. మ‌రి అవినాష్ రెడ్డి వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.