ప్రధాని మోడీకి మాజీ ప్రధాని చురకలు!

Wednesday, April 18th, 2018, 05:26:21 PM IST

ఎప్పుడూ మౌనమునిలా వుండే మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు ప్రస్తుతం ప్రధాని మోడీ పై తనదైన శైలిలో మాటల తూటాలు వదిలారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన చిన్నారుల పై అత్యాచార ఘటనలైన కథువా, ఉన్నావో ఘటనలపై ప్రధాని మోదీ ఆలస్యంగా స్పందిచడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తప్పుబట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన వెంటనే ఖండించకపోవడం వల్ల నేరస్తులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నేడు ఒక జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని మోదీని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడటం నాకు సంతోషంగా ఉంది. మౌనంగా ఉండకుండా తరచుగా మాట్లాడాలంటూ గతంలో నాకు గతంలో ఇచ్చిన సలహాను ఆయన తప్పకుండా పాటించాలి. మౌనంగా ఉంటాననే కారణంగా పత్రికా ముఖంగా ఆయన నన్ను విమర్శించేవారు. ఇతరులకు సలహాలు ఇవ్వడమే కాదు. వాటిని తప్పక పాటించాలి అంటూ మన్మోహన్‌ సింగ్‌ హితబోధ చేశారు. కథువా ఘటన గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో నెటిజన్ల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.

దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ నోరు విప్పక తప్పలేదు. నేరం చేసిన వారు ఎంతటివారైనా, వారిని ఉపేక్షించేది లేదు. మన ఆడబిడ్డలకు తప్పక న్యాయం చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఇటువంటివి జరగడం బాధాకరమని, ఘటనపట్ల తాను మనోవేదనకు లోనయ్యానని ప్రధాని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments