టిక్కెట్టు రేటు పెంచి 30వేల కోట్లు దోచారు!

Tuesday, May 22nd, 2018, 11:30:27 PM IST


ప‌రిశ్ర‌మ‌లో ఆ న‌లుగురు ఆడే ఆట గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వాడి వేడిగా చ‌ర్చ‌ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ తెలివిగా ఆట ఆడేవాడిదే గెలుపు. మార్కెట్‌ని గుప్పిట ప‌ట్టి.. త‌మ‌కు న‌చ్చిన‌ట్టు శాస‌నాల్ని రాసుకుని ఆడే తెలివితేట‌లు, ప్ర‌భుత్వాల్ని గుప్పిట ప‌ట్టి, అధికారుల్ని వ‌ల వేసి, ప‌న్ను ఎగ్గొట్టేందుకు ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు లంచం ఎర వేసి.. బ‌డా బాబులు ఆడే ఆట మామూలుగా ఉండ‌దు. ఇక్క‌డ‌ ఏదైనా న‌చ్చిన‌ట్టు దోచుకోవ‌డం అల‌వాటుగా చేసుకున్నారు కొంద‌రు. ఆ దోపిడీ ఏ రేంజులో ఉంది? అంటే అది నిజంగానే చుక్క‌ల్లో చంద‌మామ‌ను చూపించే రేంజులో ఉంద‌ని చెబుతున్నారు. థియేట‌ర్ల మెయింటెనెన్స్ పెరిగిందంటూ టిక్కెట్టు రేట్లు ఇష్టానుసారం పెంచుకుని సింగిల్ థియేట‌ర్ ఓన‌ర్లు, వాటిని గుప్పిట ప‌ట్టిన గుత్తేదారు ఆడుతున్న ఆట మామూలుగా లేదు. వాస్త‌వానికి సింగిల్ థియేట‌ర్ల‌లో టిక్కెట్టు ధ‌ర గ‌రిష్టం రూ.90 దాట‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న ఉంది. ఇటు ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో కూడిన క‌మిటీతో ఆ మేర‌కు ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు సాగిస్తోంది. అంతేకాదు.. టిక్కెట్టు రేటును త‌మ ఇష్టానుసారం పెంచేయ‌కుండా ఓ జీవో కూడా ఉంది. కానీ వాట‌న్నిటినీ తుంగ‌లో తొక్కి.. తాము మునిగిపోతున్నామంటూ ఎగ్జిబిట‌ర్లు ఆడుతున్న నాట‌కం మామూలుగా లేద‌ని చెబుతున్నారు.

సినిమా టిక్కెట్టు రేటు అడ్డ‌గోలుగా పెంచుకుని, బ్లాక్‌లో విక్ర‌యిస్తూ ఎగ్జిబిట‌ర్ సాగిస్తున్న దందా మామూలుగా లేద‌ని ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక‌ `విజ‌య‌క్రాంతి` ఓ ఆర్టిక‌ల్‌ని ప్ర‌చురించింది. ఇందులో క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాల్ని స‌ద‌రు ప‌త్రిక బ‌య‌ట‌పెట్టింది. ఏపీ, తెలంగాణ డివైడ్ అయ్యాక‌.. ఈ నాలుగేళ్ల‌లో ఎగ్జిబిట‌ర్లు టిక్కెట్టు దందాపై ఇరు రాష్ట్రాల్లో క‌లిపి ఏకంగా 30 వేల కోట్లు దోచుకున్నార‌ని స‌ద‌రు ప‌త్రిక నివేదించింది. ఆ మేర‌కు ఆధారాలు చూపించేందుకు అఖిల భార‌త సినీప్రేక్ష‌క వినియోగ‌దారుల సంఘం అధ్య‌క్షులు జీ.ఎల్‌.న‌ర‌సింహారావు సంసిద్ధంగా ఉన్నారని స‌ద‌రు ప‌త్రిక పేర్కొంది. ఇక నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్ కోణంలో ప‌రిశీలిస్తే.. బ‌డ్జెట్లు పెరిగాయి.. పారితోషికాలు పెరిగాయ‌న్న మిష‌తో తొలివారంలోనే వ‌సూళ్లు సాధించ‌క‌పోతే న‌ష్టాలు వ‌స్తాయ‌న్న మిష‌తో ఇలా అడ్డ‌గోలుగా టిక్కెట్టు ధ‌ర‌లు పెంచేస్తున్నార‌న్న సంగతి రివీలైంది. సింగిల్ థియేట‌ర్ల‌లో క్రేజీ సినిమాలు రిలీజైన‌ప్పుడు టిక్కెట్టు రేటు .. అడ్డ‌గోలుగా పెంచేయ‌డ‌మే కాకుండా ఎగ్జిబిట‌రే స్వ‌యంగా బ్లాక్‌లో అమ్మించేస్తున్నారు. ఇలాంటి వాటిని అధికారులు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments