పవన్ సత్తాను అంచనా వేయడంలో విఫలమైన సర్వే సంస్థలు!

Monday, May 20th, 2019, 10:52:23 PM IST

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ పూర్తి ఆధిక్యతను చాటుతుందో న్యూస్ ఛానెళ్లు ఎవరికి వారు స్పష్టమైన లెక్కలు చెప్పారు కానీ ఏపీలో మాత్రం ఎవరు నెగ్గుతారో చెప్పలేకపోయారు. సగం ఛానెళ్లు టీడీపీ అంటే ఇంకో సగం వైకాపా అంటున్నాయి. దీన్ని బట్టే జాతీయ సర్వేలు తూతూ మంత్రంగా సాగాయని తెలుస్తోంది. ఇంకో విషయమేమిటంటే మెజారిటీ సర్వేలు జనసేన సత్తా సున్నా అని తేల్చడం.

ఏపీ ఎన్నికల్ని నిశితంగా పరిశీలించిన ఎవరికైనా పవన్ తక్కువలో తక్కువ 12 నుండి 14 శాతం ఓట్లు చీల్చగలడని ఈజీగానే అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన పార్టీల నేతలే కొందరు జనసేనను తక్కువ అంచనా వేయడానికి లేదని అన్నారు. ఎందుకంటే పవన్ ఊపును వారు దగ్గర్నుండి చూశారు కాబట్టి. విశ్లేషకులు సైతం పవన్ సీట్లు గెలవలేకపోవచ్చు కానీ ఓటింగ్ శాతాన్ని పొందుతాడని చెబుతున్నారు. జనం సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

కానీ ఇండియా టుడే, టైమ్స్ నౌ, సిపిఎస్, ఎలైట్ లాంటి బడా సర్వేలు మాత్రం పవన్ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే పరిస్తితి లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఆ పార్టీ మాట కూడా ఉండదని తేల్చాయి. అంతేకాదు ఓటింగ్ శాతంలో జనసేన కంటే భాజాపా, కాంగ్రెస్ పార్టీలు ఉత్తమంగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇక్కడే సర్వే డొల్లతనం బయటపడింది. అసలు మాటల్లో కూడా లేని ఆ రెండు పార్టీలకు ఓటు బ్యాంకు ఎలా వచ్చిందో సర్వే చేసిన సంస్థలకే తెలియాలి.