కాంగ్రెస్ లో చేరిన రచయిత చేతన్ భగత్..!

Sunday, April 1st, 2018, 11:42:53 PM IST

ప్రముఖ రచయిత, కాలమిస్ట్, మోటివేషనల్ స్పీకర్ చేతన్‌ భగత్‌ ఆదివారం చేసిన ఓ ట్వీట్‌ ఆయన అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నానని ఆయన చేసిన ట్వీట్‌తో కొందరి గుండె గుబేలుమంది. అయ్యో ఇలా చేయొద్దు అంటూ సూచనలు ఇచ్చారు. మరికొందరు మాత్రం తేరుకున్నారు. ఇంతకు విషయమేమిటంటే.. ఏప్రిల్‌ 1 సందర్భంగా సరదాగా ‘ఫూల్స్‌ డే’ను జరుపుకునేందుకు ఈ ట్వీట్‌ను చేశారు. ‘ఇంకేంతమాత్రం చూస్తూ ఉండలేను. దేశాన్ని మార్చాల్సిన అవసరముంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా. కర్ణాటక ఎన్నికల్లో వారి తరఫున ప్రచారం చేస్తాను. దేశాన్ని బాగుచేయడంలో రాహుల్‌ గాంధీతో కలిసి పనిచేస్తా. ఇది నా జీవితంలో అతిపెద్ద నిర్ణయం. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇవిగో వివరాలు’ అంటూ చేతన్ ఓ లింక్ ను జత చేసి ట్వీట్‌ చేశారు. ఈ లింక్‌ ఓపెన్‌ చేస్తే..ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అంటూ వికీపీడియా పేజ్‌ తెరుచుకుంటోంది.

కానీ ఆయన ఇచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేయకుండానే చాలామంది ఆయన రాజకీయాల్లోకి చేరబోతున్నారంటూ పొరపడ్డారు. ‘ఇది నీ అభిమానులకు ఊహించని పరిణామం. గొప్ప రచయిత అయిన మీరు ఈ చెత్త రాజకీయాల్లోకి రావద్ద’ని ఓ అభిమాని ట్వీట్‌ చేయగా, మరో అభిమాని ‘మీరు రాయబోయే తదుపరి పుస్తకానికి ‘నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు’ అని పేరు పెట్టుకోమని సూచించారు. ‘మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మీలాంటి వారంతా వచ్చి అసలైన కాంగ్రెస్‌ విలువలను నిలబెట్టాలి’, ‘ఇప్పటివరకు మీ పుస్తకాలు చదివాను.. ఇక నుంచి మానేస్తా’ అని కొందరు కామెంట్‌ చేయగా.. ఇది ఫూల్స్‌ డే ట్వీట్‌ అని గుర్తించిన మరికొందరు నెటిజన్లు.. ‘ఏప్రిల్‌ పూల్‌ డేను మేం నమ్మాల్సిందే. రాహుల్‌తో కలిసి ఇండియా తీర్చిదిద్దండి’ అంటూ ఛలోక్తులు విసిరారు.