బాలయ్యకు బ్యాకప్ ఇస్తున్న అభిమానులు !

Friday, October 5th, 2018, 07:47:05 AM IST

అది సినిమా అయినా, రాజకీయమైనా, షూటింగ్ స్పాట్ అయినా, పొలిటికల్ టూర్ అయినా బాలక్రిష్ణ బిహేవియర్ ఒకలానే ఉంటుంది. ఆయన ఎప్పుడు కోపంగా ఉంటారో, ఎప్పుడు శాంతంగా ఉంటారో ఊహించడం చాలా కష్టం. ఇప్పటికే పలుసార్లు అభిమానుల మీద చేయి చేసుకుని వార్తలకెక్కిన ఆయన కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కొందరిని కారు దిగి మరీ తన్ని హాట్ టాపిక్ అయ్యారు. ఈ చర్యతో ఆగ్రహించిన అభిమానులు ఆయన ఫ్లెక్సీలను తగులబెట్టారు.

మీడియా ఛానెళ్లు దీనికి భారీ కవరేజ్ ఇచ్చి ఇక బాలయ్య మారడని తీర్మానం చేయగా సోషల్ మీడియాలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతం ఆయన ఇమేజ్ కు కూడ కొంచెం నష్టాన్ని చేకూర్చిందనే చెప్పాలి. దీంతో అభిమానులు తమ భాద్యతగా బాలయ్యకు బ్యాకప్ ఇచ్చే పనిలో పడ్డారు. సోషల్ మీడియాలోని కొన్ని గ్రూపులు పనిగట్టుకుని మరీ బాలయ్య మంచితనాన్ని ప్రచారం చేస్తున్నాయి.

ఆయన అభిమానులతో ప్రేమగా ఉన్న సందర్భాలను, సహాయం చేసిన సంఘటనలను ఉటంకిస్తూ వాటికి సంబందించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ బాలయ్యలో ఈ కోణం కూడ ఉంది చూడండి, ఎప్పుడు నెగెటివిటీనే ప్రచారం చేస్తుంటారు అంటూ పెద్ద చర్చ మొదలుపెట్టారు. అభిమానుల్లో తమ హీరోకి సపోర్ట్ ఇవ్వాలనే ఈ తపన అభినందించదగినదే. కానీ ఎవరి విషయంలోనైనా మంచి కన్నా చెడే 100 రెట్లు వేగంగా జనాల్లోకి వెళుతుంది. కాబట్టి అభిమానుల కోసమైనా బాలయ్య కొంచెం దూకుడు తగ్గిస్తే బాగుంటుందేమో.