రైతు పాదమే ఉక్కు పిడికిలై విజయం సాధించింది..

Tuesday, March 13th, 2018, 11:30:53 PM IST

ఈ పోరాటం నాగరిక భారతావానికో వెలుగు రేఖ, హక్కుల కోసం పోరాడే వారికి ఓ దివ్య కాన్తియై వెలుగు చూపింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్న శ్రీ శ్రీ మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందరూ ఒక్కటైతే విజయం తథ్యమని మరోసారి రుజువైంది. మండుటెండలో బొబ్బలొచ్చిన పాదాలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ఆరు రోజుల పాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యలకోసం ముంబయి చేరుకున్నారు మహారాష్ట్ర రైతన్నలు. రైతుల ఆందోళనతో మహా సర్కారు గగ్గోలు పెడుతూ దిగొచ్చింది. దాదాపు అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది.

రుణ మాఫీ, కనీస మద్దతు ధర వంటి డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివచ్చిన వేల మంది రైతుల ముందు మహారాష్ట్ర సర్కార్ తలవంచి సలాం కొట్టింది. వారి డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా వాగ్దానం చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం రైతుల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. గిరిజనులు పండించుకుంటున్న అటవీ భూములను వారికే అప్పగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకుంటారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రుణ మాఫీ, పంటకు కనీస మద్దతు ధర పెంపు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర డిమాండ్ల కోసం అసెంబ్లీని ముట్టడి చేసేందుకు వచ్చిన రైతులకు ముంబైకర్లు ఘన స్వాగతం పలికారు. నాసిక్‌లో బయల్దేరి ఆరు రోజులు కాలినడకన 180 కిలోమీటర్లు నడిచి వచ్చిన రైతులు ఆదివారమే ముంబైకి చేరుకున్నారు. వేల మంది రైతులు ఎర్ర జెండాలు చేతపట్టుకొని ఎర్ర టోపీలు ధరించడంతో ఆజాద్ మైదాన్ ఎర్ర సముద్రాన్ని తలపించింది.

ఆదివారం రాత్రి సియన్‌లోని సోమయ్య గ్రౌండ్స్‌కు చేరుకున్న అన్నదాతలు సోమవారం వేకువ జామునే ఆజాద్ మైదాన్‌కు వచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీ వైపు బయల్దేరాలని తొలుత నిర్ణయించిన రైతులు, పరీక్షలు రాసే విద్యార్థులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని ర్యాలీని రాత్రికి వాయిదా వేసుకున్నారు. ఈ లోపు వారి వద్దకు ప్రభుత్వం కొందరు ప్రతినిధులను పంపడంతో సమస్య శాంతియుతంగా పరిష్కారమైంది. సీఎం ఫడ్నవీస్ రైతు ప్రతినిధులతో సుమారు రెండుగంటలు చర్చలు జరిపారు. ఈ భేటీకి ప్రతిపక్ష నాయకులను, కొందరు మంత్రులను సైతం అనుమతించలేదు. ఈ చర్చల్లో రైతుల పక్షాన ఏఐకేఎస్ అశోక్ ధావలే, సీపీఎం ఎమ్మె ల్యే జీవా పండు గవిట్ పాల్గొన్నారు. రైతులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సెంట్రల్ రైల్వే ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments