తాగడానికి డబ్బులివ్వలేదని ముక్కు కొరికాడు…

Saturday, April 7th, 2018, 12:31:48 PM IST

తాగుడుకు బానిసలైన వాళ్లు మద్యం కొనుక్కునేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్నవారిపై దాడులు చేసిన ఘటనలు ప్రతిరోజు దేశం నలుమూలలా ఏదో చోటు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో మాత్రం మద్యానికి బానిసైన వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వనందుకు తోటి సోదరుడిపై దాడి చేసి అతని ముక్కును కొరికేశాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శ్రీకాంత్ ఆల్కహాల్ కొసం డబ్బులివ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేశాడు. అతడు తిరస్కరించడంతో కోపానికి గురైన శ్రీకాంత్ మద్యం మత్తులో సోదరుడి ముక్కు కొరికేశాడు. ఈ క్రమంలో తన నివాసంలో తల్లిదండ్రులు, మామపై కూడా దాడి చేశాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు పొలీసులు తెలిపారు.

బాధితుడు సొబ్రాన్ సంఘటనా ప్రదేశంలోనే కుప్పకూలాడని, తీవ్ర నొప్పితో బాధపడ్డాడని ఎస్పై జితేంద్రసింగ్ వెల్లడించారు. సొబ్రాన్ విలేకరులతో మాట్లాడుతూ..నాతో పాటు నా తండ్రిని కొరికిన అతడు.. తరువాత మా అమ్మ, మామపై కూడా దాడి చేశాడు. నా ముక్కు ముక్కలు ముక్కలైంది. అంతటితో ఆగకుండా నా చేతులపై, పొట్టపై కూడా కరిచాడని సొబ్రాన్ వివరించాడు. ఐతే ఆరోపణలన్నీ అబద్దాలేనని నిందితుడు కొట్టిపారేయడం గమనార్హం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments