న్యూస్ కాస్ట‌ర్స్ కు ధీటుగా ఫిల్మ్‌క్రిటిక్స్ ప‌ని చేస్తారా?

Sunday, May 26th, 2019, 08:10:53 PM IST

దాదాపు 85 ఏళ్ల టాలీవుడ్ హిస్ట‌రీలో 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన అతిపెద్ద అసోసియేష‌న్ ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ అంటూ ప్రెస్ అకాడెమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ పొగిడేశారంటే టాలీవుడ్ ఫిలింక్రిటిక్స్ సీనియారిటీని అర్థం చేసుకోవ‌చ్చు. అయితే గ‌త కొంత‌కాలంగా ఈ అసోసియేష‌న్ సుప్తావ‌స్థ‌లోకి వెళ్లిపోవ‌డంపై క్రిటిక్స్ లోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే ఈ అసోసియేష‌న్ ని చాలా కాలం త‌ర్వాత రీవ్యాంప్ చేసి.. కొత్త స‌భ్య‌త్వాలు ఇచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఏక‌గ్రీవ క‌మిటీని .. అధ్య‌క్ష కార్య‌ద‌ర్శుల్ని ప్ర‌క‌టించ‌డం ఓ సెన్సేష‌న్. అయితే ఈ అసోసియేష‌న్ వెబ్ అండ్ టీవీ న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ త‌ర‌హాలో సేవ‌లందించ‌గ‌ల‌దా? నిజాయితీగా ఆ ప‌నులు చేయ‌గ‌ల‌రా? హెల్త్ కార్డులు.. ఇళ్ల‌స్థ‌లాలు అంటూ ప్రామిస్ లు చేశారు. అయితే ప‌నిలో నిజాయితీ ఎంత‌? అన్న చ‌ర్చ సాగుతోంది.

50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శిగా ఇ. జనార్ధన రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.జి. భవాని, సజ్జా వాసు, సంయుక్త కార్యదర్శులుగా మాడూరి మధు, పర్వతనేని రాంబాబు, కోశాధికారిగా ఎం.ఎన్. భూషణ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సాయి రమేష్, బత్తుల ప్రసాద్, నారాయణరావు, పి. హేమసుందర్, ఆర్.డి.ఎస్. ప్రకాష్, ముత్యాల సత్యనారాయణ, పి. మురళీకృష్ణ, రమేష్ చిన్నమూల, సునీతా చౌదరి, జిల్లా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ సభ్యులు లక్ష్మణరావు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, ప్రభు ఈ ఎన్నికలను సమన్వయం చేశారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ అసోసియేషన్ కు ఎన్నికలు జరుగుతాయి.

ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తానని నూతన అధ్యక్షుడు సురేష్ కొండేటి అన్నారు. తెలుగు సినిమా రంగంలో ఈ అసోసియేషన్ కు ప్రాధాన్యం ఎనలేనిదన్నారు. అందుకే ఈ అసోసియేషన్ కు తన వంతు విరాళంగా లక్ష రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులకు ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సమస్యలపై తమ కమిటీ తక్షణమే కార్యరంగంలోకి దిగుతుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు ఎన్నోసార్లు తాను పదవులు నిర్వహించినందున ఆ అనుభవంతో సభ్యులందరి అభ్యున్నతి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తామని ఎన్నికైన సభ్యులంతా హామీ ఇచ్చారు.