లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఫిల్మ్‌స్టార్స్ హంగామా!

Saturday, March 16th, 2019, 10:01:45 AM IST

2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ఏడాది జ‌రుగుతున్న లోక్‌స‌భ స‌మ‌రానికి ప్ర‌త్యేక‌త వుంది. పుల్వామా దాడిని అడ్డుపెట్టుకుని ప్ర‌ధాని మోదీ మ‌రోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని తాప‌త్ర‌యప‌డుతుంటే కాంగ్రెస్ ఇదే మంచి అవ‌కాశం అంటూ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇదిలా వుంటే ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపించ‌డానికి ఫిల్మ్ స్టార్స్ స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కొంత మంది లోక్‌స‌భ బ‌రిలో నిలిస్తే మ‌రికొంత మంది శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పోటీప‌డుతున్నారు. మ‌రి కొంత మంది ఇలా పోటీకి దిగిన వారికి అండ‌గా నిలుస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కొంత మంది ఎంపీలుగా, మ‌రి కొంత మంది ఎమ్మెల్యేలుగా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు.

తెలుగు నుంచి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేనా పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు. ఇక సీనియ‌ర్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ `మ‌క్క‌ల్ నీది మ‌య్యిమ్‌` అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించి బ‌రిలోకి దిగుతున్నారు. క‌న్నడ న‌టుడు ఉపేంద్ర ఖాకీ డ్రెస్ కోడ్ ధ‌రించి ప్ర‌జాకీయ పార్టీ పేరుతో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. క‌ర్ణాట‌క మాండ్య నుంచి న‌టి సుమ‌ల‌త అంబ‌రీష్, `జాగ్వార్‌` ఫేమ్ నిఖిల్ గౌడ‌ లోక్‌స‌భ స్థానానికి పోటీప‌డుతున్నారు. అయితే ఈ ఇద్ద‌రిలో సుమ‌ల‌త‌కు `కేజీఎఫ్‌` ఫేమ్‌ య‌ష్‌, ద‌ర్శ‌న్ మ‌ద్ద‌తుగా నిలుప్తున్నారు.

ఇక బీజేపీ త‌రుపున కేర‌ళ నుంచి న‌టుడు సురేష్ గోపీ మ‌రోసారి ఎంపీగా పోటీప‌డుతున్నారు. హిందూపురం నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ పోటీప‌డుతున్నారు. న‌గ‌రి నుంచి రోజా, మెద‌క్ నుంచి విజ‌య‌శాంతి, బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నుంచి ప్ర‌కాష్‌రాజ్ తొలిసారి పోటీకి దిగుతున్నారు. వీరిలో ఎంద మంది గెలిచి చ‌ట్ట స‌భ‌ల‌కు వెళ‌తారు? ఎంత మంది ఓడ‌తారన్న‌ది ప్ర‌జ‌ల చేతుల్లోనే వుంది.