మొత్తానికి సామాన్యుడికి అందుబాటులోకి లగ్జరీ రైలు ప్రయాణం!

Monday, March 5th, 2018, 04:00:43 PM IST

ఇప్పటివరకు సామాన్యుడి పాలిట అందని ద్రాక్షలా తయారయిన లగ్జరీ రైల్ ప్రయాణం ఇకనుండి అందుబాటులోకి రానుంది. ఇటీవల ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్ల ప్రయాణ ఛార్జీలను సగానికి సగం తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ఛార్జీలు ఇప్పటివరకు వేలల్లో ఉన్నాయి. ది పయనీర్ అందించిన నివేదిక ప్రకారం, తగ్గించిన ఈ ఛార్జీల వల్ల వచ్చే నష్టాలను రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీ లాంటి భాగస్వాములు భరించాల్సి ఉంటుంది.

ఈ లగ్జరీ రైళ్లపై విదేశీ ప్రయాణికుల ఆసక్తి గణనీయమైన రీతిలో తగ్గిపోవడం, ఇటువంటి రైళ్ల పేరు ఎత్తితే చాలు ఎగువ తరగతి వారు కూడా కొంత మేర ఖర్చు గురించి బాహాయపడటం కూడా ఛార్జీల తగ్గింపు నిర్ణయానికి ఓ కారణం. ప్యాలెస్ ఆన్ వీల్స్, రాయల్ రాజస్థాన్ లగ్జరీ రైళ్ల రెవెన్యూ వరుసగా 24 శాతం, 63 శాతానికి పైగా పడిపో యినట్లు తెలుస్తోంది. ఈ రెండు రైళ్లను భారత రైల్వే శాఖే నడిపిస్తోంది. కాగా ఈ నెల 1వ తేదీన జరిగిన రైల్వే బోర్డు సమీక్షా సమావేశంలో ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు అలానే దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉండేలా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొంత మేర ఆదాయం పెరుగుతుందని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది….